IND vs BAN: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్న చందంగా ఉంది టీమ్ఇండియా పరిస్థితి. ఆదివారం జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో వికెట్ తేడాతో ఓటమి పాలై బాధలో ఉన్న టీమ్ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయకపోవడంతో(స్లో ఓవర్ రేట్) జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది.
భారత జట్టు నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే గుర్తించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఈ లెక్కన భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (73; 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించగా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ అసన్ 5 వికెట్లు, ఎబాదత్ హుస్సెన్ 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాంసించారు. మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ), ముస్తాఫిజుర్ (10 నాటౌట్;11 బంతుల్లో 2 ఫోర్లతో ) అద్భుతంగా పోరాడడంతో లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.