ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు అసలు సిసలు ఆధారం అక్రమ ఆదాయమేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు సక్రమ ఆదాయం కంటే పూర్తిగా అక్రమ ఆదాయం మీదే ఆధారపడి ముందుకు అడుగులు వేస్తున్నాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ గత నవంబర్ 4న విడుదల చేసిన తన తాజా నివేదికలో వెల్లడించింది. న్యాయ మార్గాల ద్వారా, చట్టబద్ధంగా, ఒప్పందాల ప్రకారం గడిస్తున్న ఆదాయం కంటే అక్రమ మార్గాల ద్వారా, చట్ట విరుద్ధంగా వివిధ దేశాలు సంపాదిస్తున్న ఆదాయం దాదాపు పది రెట్లు ఎక్కువని ఈ నివేదిక ఆధారాలతో సహా బయటపెట్టింది. సక్రమ మార్గాల ద్వారా ఏ దేశమూ, ఏ ఆర్థిక వ్యవస్థా ముందుకు వెళ్లలేదని అది తేల్చి చెప్పింది. అమెరికా, ఫ్రాన్స్, కెనెడా, చైనా, ఆస్చ్రేలియా, బ్రిటన్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలోనే కాక, భారత్ సహా అనేక వర్ధమాన దేశాలలో సైతం అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వృద్ధి చెందుతున్నాయి. వివిధ దేశాల మధ్య లిఖిత వాణిజ్య ఒప్పందాల కంటే అలిఖిత, అప్రకటిత వాణిజ్య ఒప్పందాలే కోట్లకు కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని ఆ నివేదిక గణాంక వివరాలతో సహా బయటపెట్టింది.
ఆదాయం, సంపద, ఉద్యోగాలు, వ్యవస్థలు, సరికొత్త వ్యాపారాలు, ఆవిష్కరణలు వంటి అంశాలలో అక్రమ మార్గాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని, అక్రమ వ్యాపారాలు లేని ఆర్థిక వ్యవస్థలు (దేశాలు) కుప్పకూలిపోవడం ఖాయమని ఈ నివేదికను ఆసాంతం చూసినవారికి ఇట్టే అర్థమైపోతుంది.
ప్రతి దేశంలోనూ చట్టబద్ధ సంస్థలున్నట్టే, చట్ట విరుద్ధ సంస్థలు కూడా పుట్టి పెరుగుతూ తామర తంపరలా విస్తరిస్తున్నాయి. ఈ చట్ట విరుద్ధ సంస్థల ద్వారా ఏటా లక్షలాది మంది సంపన్నులు తయారవుతుండడమే కాక, కోట్లాది మందికి ఉపాధి లభిస్తోందని కూడా తెలుస్తోంది. మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, మహిళల అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అశ్లీల చిత్రాలు, నకిలీ వస్తువులు, ఆయుధాల అక్రమ రవాణా, కళాఖండాల చోరీ, చమురు చోరీ, వన్యప్రాణుల రవాణా, ఆటవిక వస్తువుల రవాణా వగైరా వ్యాపారాల వల్ల ప్రపంచంలో ఏటా కొన్నికోట్ల డాలర్ల ఆదాయం ఉత్పత్తి అవుతోంది.
ప్రపంచీకరణ తర్వాత ఈ రకమైన వ్యాపారాలు మరీ ఊపందుకున్నాయి. ఇవి అనేక దేశాలలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంపదను, ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, ఒక రకంగా రాజకీయ అస్థిరతకు కూడా తోడ్పడుతున్నాయి. నిజానికి, ఈ రకమైన అక్రమ వ్యాపారాలు, పరిశ్రమల వార్షికాదాయం ఇదమిత్థంగా ఎంత అన్నది చెప్పలేం కానీ, ప్రపంచ దేశాల అర్థిక వ్యవస్థల మీద మాత్రం వాటి ప్రభావం ఎవరూ ఊహించనంత ఎక్కువగా ఉంటోంది. ఈ అక్రమ వ్యాపారాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం అగ్ర స్థానంలో ఉందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల వ్యాపారం అని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితే అంచనా వేసింది. నిజానికి, ఈ సంఖ్య అనధికారికంగా మరెంతో ఉండవచ్చని కూడా అంటున్నారు. ఇది ప్రస్తుతం రోజు రోజుకీ పెరిగే వ్యాపారమే తప్ప పతనమయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కొకైన్, గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు ప్రపంచం నలుమూలలకూ రవాణా అవుతున్నాయి. ఈ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంతోనే తాలిబాన్లు, ఉగ్రవాదులు, రాజకీయ అసమ్మతి వాదులు ఓ వెలుగు వెలుగుతున్నారు. వీటి అక్రమ రవాణాను అదుపు చేయడం ప్రభుత్వాలకు రాను రానూ అసాధ్యమైపోతోంది. వీటివల్లే ఆఫ్ఘనిస్థాన్, మెక్సికో వంటి దేశాలు అతలాకుతలమైపోతున్నాయి.
నకిలీ వ్యాపారం బెడద
ఇక నకిలీ ఉత్పత్తుల వ్యాపారం కూడా అడ్డూ ఆపూ లేకుండా దాదాపు రెండున్నర లక్షల కోట్ల డాలర్లతో దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు తయారైనా, ఏ సాఫ్ట్ వేర్ రూపుదిద్దుకున్నా మరోచోట దానికి ఒక నకిలీ వస్తువు కూడా తయారవుతుంటుంది. పెప్సీ నుంచి గుండు సూది వరకూ ప్రతి వస్తువుకూ నకిలీ ఉత్పత్తి అవుతుంది. ఔషధాల నుంచి కంప్యూటర్ చిప్స్ వరకు, వీడియో గేమ్ దగ్గర నుంచి పుస్తకాల వరకు నకిలీలు తయారై, అసలు వస్తువుల కంటే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్త అసలు వస్తువుల వ్యాపారంలో ఈ నకిలీ వస్తువుల వ్యాపారం సుమారు ఏడు శాతం ఉంటుందని అంచనా. 2007లో రెండు లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన ఈ నకిలీ వస్తువులు 2009 నాటికి ఎకాయెకిన రెండున్నర లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని అధికారిక అంచనా.
అక్రమ ఆయుధాల వ్యాపారం ఏ స్థాయిలో ఉందో, ఎక్కడ ప్రారంభమై, ఎక్కడికి చేరుకుంటోందో నర మానవుడికి కూడా తెలియదు. ఆఫ్రికా దేశాలు, మధ్య ఆసియా, మెక్సికో తదితర దేశాలకు ఈ ఆయుధాలు విపరీతంగా రవాణా అవుతున్నాయని ఐక్యరాజ్య సమితి సైతం అంగీకరించింది. దీని ఆదాయం ఎన్ని లక్షల కోట్ల డాలర్లు ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమని అధికారులు భావిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలు ఉత్పత్తి అవుతుండడమే కాకుండా, అధికారికమైన ఆయుధాలకు ధీటుగా ప్రపంచంలోని అన్ని దేశాలకూ సరఫరా అవుతున్నాయని ఫోర్బ్స్ కూడా వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ క్రైమ్ ఆఫీస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం సిగరెట్ల అక్రమ రవాణా కూడా కొన్ని లక్షల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. పన్నుల వలకు చిక్కకుండా ఉండడానికి పెద్ద మొత్తంలో ఈ సిగరెట్ల రవాణా అక్రమ మార్గాలలో జరుగుతుంటుంది. ఇక నౌకల్లోనూ, విమానాల్లోనూ చట్టబద్ధంగా రవాణా అవుతున్న వస్తు పరికరాలను చోరీ చేయడం కూడా ఓ పెద్ద వ్యాపారమేనని ఫోర్బ్స్ తెలిపింది. సుమారు 30 వేల కోట్ల డాలర్ల మేరకు ఈ వ్యాపారం జరుగుతోందని, దీన్ని నిరోధించడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని అది తెలియజేసింది. అమెరికా, మెక్సికో, బ్రెజెల్, రష్యా, ఇండియా, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి ఎగుమతి అవుతున్న వస్తు పరికరాలు మార్గమధ్యలోనే చోరీకి గురవుతున్నాయి.
చోరీలు ఓ పెద్ద వ్యాపారం
ఇదే విధంగా పెట్రోల్, డీజల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు కూడా మార్గమధ్యంలోనే చోరీకి గురవుతున్నాయి. ఈ చోరీ వస్తువుల విలువ కూడా వేల కోట్ల డాలర్లలో ఉంటుందని ఫ్రయిట్ వాచ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తాజాగా తెలియజేసింది. వీటన్నిటికన్నా ఆందోళన కలిగించే వ్యాపారం మనుషుల అక్రమ రవాణా. పడుపు వృత్తిలో దించడం కోసం, బానిసలుగా వాడుకోవడం కోసం, అవయవాలను తీసుకోవడం కోసం మనుషులను, ముఖ్యంగా మహిళలను అక్రమంగా తరలించడం అతి వేగంగా పెరిగిపోతున్న వ్యాపారంగా దాదాపు అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆటవిక నేర బృందాలు ఏర్పడి మనుషులను ఎత్తుకెళ్లి తమ అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతోంది. మనుషుల్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించడం ఈ బృందాలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ వ్యాపారం కూడా ముప్పయ్ లక్షల కోట్ల డాలర్ల పైచిలుకేనంటున్నారు. ఇక కళాఖండాల చోరీ, అక్రమ రవాణా కూడా బాగా ఊపందుకుంటోంది. వన్య ప్రాణులను, వాటి తోళ్లు, దంతాలను అక్రమంగా తరలించి అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల డాలర్ల వ్యాపారం చేయడం కూడా ఒక పెద్ద ఆదాయ వనరయిపోయింది. మామూలు అంచనా ప్రకారం గత ఏడాది ఈ వ్యాపారం విలువ లక్ష కోట్ల డాలర్ల వరకూ ఉంటుందని తెలిసింది.
చట్టబద్ధమైన వ్యాపారాలు చేయడం కంటే కొద్దిగా ముప్పు ఉన్నా ఈ అక్రమ వ్యాపారాలు చేయడం వల్లే అతి తేలికగా ఆదాయం పెంచుకోవడం అన్నది ఇప్పుడొక ఆనవాయితీగా మారిపోయింది. ఎంత నిఘా పెట్టినా, ఇంటర్ పోల్ తో సహా ఎన్ని పోలీస్ బృందాలు పనిచేస్తున్నా వీటిని కట్టడి చేయడం మాత్రం గగనమైపోతోంది. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ సమాంతర ఆర్థిక వ్యవస్థలు నడుస్తున్నాయని ఇవి చెప్పకనే చెబుతున్నాయి.