Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతను ఉన్నట్లుండి మెట్లపై నుండి పడిపోయాడని విస్తృత ప్రచారం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో పుతిన్ ఇబ్బంది పడుతున్నాడని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. తాజాగా పుతిన్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. స్వయంగా మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేస్తూ క్రిమియా వంతెనపై పుతిన్ ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యాకు చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ఈ వీడియోను ప్రసారం చేసింది.
రష్యా – క్రిమియాను కలిపే బ్రిడ్జి రెండు నెలల క్రితం కూల్చివేశారు. తాజాగా ఈ వంతెనను పుతిన్ పరిశీలించారు. స్వయంగా బెంజ్‌కారు డ్రైవ్ చేసుకుంటూ బ్రిడ్జిపైకి వెళ్లి బ్రిడ్జి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమయంలో కారులో పుతిన్‌తో పాటు డిప్యూటీ ప్రధాని మారాట్ ఖుసులిన్ కూడా ఉన్నారు. పుతిన్ కారును డ్రైవ్ చేస్తూ.. మరోవైపు బ్రిడ్జి ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రష్యా టెలివిజన్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. వంతెన ఎడమ వైపు దాడి జరిగింది. ఇది పనిచేసే స్థితిలోనే ఉందని అనుకొంటున్నాను. అయినప్పటికీ దాని పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికీ కొంత దెబ్బతిని ఉంది. దీనిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి అని పుతిన్ పేర్కొన్నట్లు వీడియోలో ఉంది.
2018 సంవత్సరంలో సుమారు 19కిలో మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని స్వయంగా పుతిన్ ప్రారంభించారు. అప్పట్లో కూడా పుతిన్ ట్రక్కుపై స్వయంగా డ్రైవింగ్ చేస్తూ దీనిపై ప్రయాణించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వాతావరణం నేపథ్యంలో కొందరు ఈ బ్రిడ్జిని గత రెండు నెలల క్రితం పేల్చివేశారు. ఈఘటనకు పాల్పడింది ఉక్రెయినే అని రష్యా బలంగా భావిస్తోంది. క్రిమియా ప్రాంతానికి రష్యాకు రాకపోకలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో దెబ్బతిన్న ప్రాంతంలో బ్రిడ్జిని మరమ్మతు చేసేందుకు పుతిన్ నిర్ణయించుకొని ఈ బ్రిడ్జిని పరిశీలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పనిలోపనిగా పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకుసైతం చెక్ పెట్టినట్లయింది.