భారతీయ జనతా పార్టీ తన ప్రత్యర్థులను రకరకాలుగా వేధిస్తుంది. ఎన్నికల్లో న్యాయంగా గెలుపొందినప్పుడు మాత్రమే ఇది కనిపించదు. బీజేపీ తమ నాయకులను, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తుం దని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలాడంటూ ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసింది. నరేంద్ర మోదీ పేరులో సవరణ చేయాలని డిమాండ్ చేశాడనే ఆరోపణలపై ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టు చేయించారు. ఈ రకంగా అవకాశం దొరకబుచ్చుకొని విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్ప డుతున్నదని.. గవర్నర్ల ద్వారా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలకు ఇబ్బందులు పెట్టి పరిపాలన కొనసాగకుండా చేస్తుందనీ విమర్శిస్తున్నారు. ప్రత్యర్థులు, విపక్ష నాయకులపైకి ఈడీని ప్రయోగిస్తుందని ఎన్నో పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడం కూడా ఇటువంటిదే అని అంటున్నాయి. మరో పక్క బీజేపీ నాయకులు ఎవరైనా ఆర్థిక అవకతవకలకు పాల్పడినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పార్టీలు మండిపడుతున్నాయి. గుజరాత్‌లోని బీజేపీ నాయకులైతే పట్టపగ్గాలు లేకుండా పోతున్నా పట్టించుకోవడం లేదంటున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేసిన వారిని కూడా వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలా ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపలేకపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో దాన్ని ఎవరూ నిలువరించ లేకపోతు న్నారు. ఈ ఊపుతోనే అది దక్షిణ భారత దేశంలోనూ బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నది.
ఇదే ఊపులో ఆ పార్టీ దక్షిణ భారత దేశంలోనూ బలంగా విస్తరించాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. నిన్నమొన్నటి దాకా కర్నాటకలో గెలుస్తుందనే నమ్మకంతో అక్కడి నుంచి తెలంగాణ మీదుగా పార్టీని విస్తరించాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. అయితే, అది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినందున తదు పరి అది ఏం చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఒక్క ఓటమితో అది వెనుకంజ వేస్తుందా? అంటే, వేయకపోవచ్చు అనే జవాబు చెప్పుకోవాలి. దీని కోసం అది ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి. వీటి సంగతి ఎలా ఉన్నా బీజేపీ యత్నాలను ఇతర దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం ఒక దుష్ట శకునంగా భావి స్తున్నాయి. దీనితో ప్రస్తుత పరిస్థితి గంభీరంగా మారింది.బీజేపీ దక్షిణాది విస్తరణ యత్నాలకు ఇప్పటికే ప్రతి ఘటన మొదలైందని చెప్పాలి. ఇవి క్రమంగా పెరుగుతూ అయిదు రాష్ట్రాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడే అవకా శాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలది ఒకే అభిప్రాయంగా ఉంది. ఈ రాష్ట్రాలు దేనికదే తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాలు కలిగి ఉన్నాయి. వాటి మధ్య నదీ జలాల పంపిణీ వంటి కొన్ని విభేదాలున్నప్పటికీ ఉత్తర భారత పార్టీలు, పార్టీ నాయకుల పెత్తనం విషయంలో మాత్రం అందరిదీ ఒకే అభిప్రాయం గా ఉంది. అందుకే, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు విషయంలో ఇప్పటికిప్పుడే అవన్నీ ఏకతాటిపైకి రాక పోయినా కూడా ఎవరికి వారుగానే దాని ఆధిపత్యాన్ని ప్రతిఘటించవచ్చు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలోని అధికార, విపక్ష పార్టీలు ఈ పాటికే బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పిస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం.
తమిళులు హిందీని బాగా వ్యతిరేకిస్తారు. ఈ కార ణంగానే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తమిళనాడు సంద ర్శన సమయంలో అక్కడి ప్రజలతో ఇంగ్లిషులో సంభాషి స్తారు. జాతీయ వాద పార్టీకి చెందిన ప్రధాని అక్కడి సామాన్య ప్రజలతో ఇలా పరాయి భాషలో మాట్లాడటం వారికి నచ్చదు. ఇలాంటి ఎన్నో కారణాంశాల వల్ల బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడం అంత ఈజీ కాదు. కానీ, అది తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుంది. గతంలో హస్తినలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వా లను పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం, చీకాకు పరచడం, అస్థిరతకు గురి చేయడం వంటి కంటక యత్నాలు కొన సాగించేది. బీజేపీ కూడా ఇలాగే పలు రాష్ట్రాలను వేధింపు లకు గురి చేస్తున్నది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బీజేపీపై పలు విమర్శలు చేశారు. తమలాగే బీజేపీ ప్రభావిత గవర్నర్లకు వ్యతిరేకం గా తీర్మానం చేయాలంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రా లకు ఉత్తరాలు కూడా రాశారు. 2022లో రాష్ట్రాల ఉచిత పథకాలపై కేంద్రం ప్రశ్నించిన సందర్భంలో తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పళనివేలు త్యాగరాజన్ ‘మీరు చెప్పే మాటలకు రాజ్యాంగ బద్ధత అయినా ఉండాలి లేదా మీకు అనుభవమైనా ఉండాలి. అదీ కాకపోతే, ఈ విషయంలో మీరు నోబెల్ అవార్డు అయినా పొంది ఉండాలి. అప్పుడైతే మీరు మాకన్నా జ్ఞానవంతులని భావిస్తాం. మీరు చెప్పేది వింటాం అని సూటిగా ప్రకటించారు.
మన రాష్ట్రంలోనూ ప్రధాని మోదీ ఇటీవల తెలం గాణను సందర్శించినప్పుడు అధికారిక సభలకు ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా మోడీ, కేసీఆర్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు కూడా. తమిళ నాడు కన్నా ఒకడుగు ముందుకేసి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి వ్యతి రేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఆధిపత్య ధోరణిని, అధికార బీజేపీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రంతో ఇంతగా విభేధిస్తున్న ప్పటికీ ఉత్తర భారతం నుంచి విడిపోతాము అన్న మాట అనలేదు. అది నేరం కాబట్టి వారు అలా ప్రకటించ లేపోతున్నారు. అయితే, మూడు అంశాలపై ఆధారపడి రానున్న కాలంలో ఈ డిమాండ్ ముందుకు రావచ్చు. ఉత్తర భారతంలో బీజేపీ మరింత బలపడి విపక్ష పాలిత రాష్ట్రాలను ఇలాగే వేధిస్తుంటే గానీ, పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక చర్యలు లేక ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు గానీ, లేక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక బలమైన నాయకులు ఆవిర్భవించి కేంద్రం పెత్తనాన్ని, అధికారంలో ఉన్న పార్టీల రాజకీయపుటెత్తుగడలను ప్రశ్నిస్తూ దక్షిణ భారత దేశం ప్రత్యేకం అన్న డిమాండ్‌ను బలంగా విని పించవచ్చు. విడిపోతే నష్టమేంది? అన్న ప్రశ్నను లేవనెత్తి దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయవచ్చు? ఉత్తర భారత ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసా గించవచ్చు.
ఇటీవల కొందరు సినిమా నటులు ఇలా దక్షిణ భారత్ నుంచి నాయకులుగా ఎదగాలని ప్రయత్నిస్తుం డడం గమనించవచ్చు. ఫెడరలిజం వంటి పదాలను బాగా అర్థం చేసుకుని తమకనుకూలంగా వాడుకోగలిగి, బీజేపీ మాదిరిగా తమ వాదనలను ప్రభావవంతంగా విన్పించ గలిగిన వారు రాజకీయ ప్రఖ్యాతి పొందగలరు. దక్షిణ భారతం ప్రత్యేకం అన్న ఉద్యమాన్ని కూడా నిర్మించగలరు.
అయితే, భారత దేశ భావన (ఐడియా ఆఫ్ ఇండి యా)ను వీరెవరూ అధిగమించలేరు అన్న వాదనలు న్నాయి. విభిన్న ప్రజలను, విశాలమైన ప్రాంతాలను భారత దేశంగా కలిపి ఉంచుతున్న అంశాలేవి? అన్న విషయాలు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇదే ప్రశ్నను భారతీయ మేధావులను అడిగిప్పుడు ‘ఇంగ్లిషు, క్రికెట్, బాలీవుడ్..’ అంటూ పలు రకాల జవాబులు చెబుతు న్నారు. కానీ, సరైన సమాధానం మాత్రం చెప్పలేకపోతు న్నారు. దేశం అనేది ఒక అలవాటు. కాలక్రమంలో ఇది ఒక గట్టి నమ్మకంగా, విశ్వాసంగా ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. ఎవరూ దాన్ని వ్యతిరేకించలేనంతగా ఘనీభవించిపోయింది. అయితే, దక్షిణ భారత దేశం కూడా ఇలాంటి ఒక తిరుగులేని విశ్వాసమే!
(‘మింట్’ పత్రికలో జర్నలిస్టు, రచయిత మను జోసెఫ్ రాసిన ‘ఏ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ నాట్ ఎంటైర్లీ అన్ థింకబుల్’ అన్న వ్యాసానికి నేలంటి మధు స్వేఛ్చానువాదం)