Modi Phone: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఆ మేరకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇటీవల వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వర్సెస్ టీఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. షర్మిల పాదయాత్రను వరంగల్ అడ్డుకోవటంతోపాటు.. అందుకు నిరసన తెలిపినందుకు హైదరాబాద్‌లో ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఏకంగా ప్రధాని మోదీ స్పందించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు. తాజా పరిణామాలపై షర్మిలతో మోదీ చర్చించారు. ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. దాదాపు పది నిమిషాల పాటు వీరి మధ్య ఫోన్‌లో సంభాషణ జరిగింది. ఢిల్లీకి రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ షర్మిలకు సూచించడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
తెలంగాణలో చోటుచేసుకొనే ప్రతీఒక్క ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం.. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ను దెబ్బతీసేందుకు ఉపయోగపడే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల వర్సెస్ టీఆర్ ఎస్ ప్రభుత్వం మధ్య జరిగిన ఎపిషోడ్ పై ఏకంగా ప్రధాని స్పందించడం ఈ విషయానికి అద్దపడుతుంది. ఇదిలాఉంటే సోమవారం ఢిల్లీలోజీ-20 సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ పాల్గొన్నారు. జగన్‌తో మాట్లాడుతున్న క్రమంలో ప్రధాని మోదీ షర్మిల ప్రస్తావన తెచ్చినట్లు తెలిసింది. షర్మిల అరెస్టు తీరు విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు? అని నేరుగా జగన్‌నే ప్రధాని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్ ఎస్ ను ఓడించేందుకు అందివచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతూనే.. మరోవైపు ఇతర పార్టీల్లోకి కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ రోజురోజుకు బలం పుంజుకుంటుంది. దీనికితోడు సీఎం కేసీఆర్‌పై ఎదురుదాడి చేసే ప్రతీఒక్కరిని తమకు మిత్రులుగా మార్చుకోవటంలో బీజేపీ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఫోన్‌చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా పరిణామాలను చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, షర్మిల మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో మోదీతో షర్మిల భేటీ అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి.. కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నట్లు అర్థమవుతుంది.