Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఒకటే తిట్లు, దాడులు కూడా.. 'యువగళం' సీన్లు ఇవన్నీ

Nandyala: ఒకటే తిట్లు, దాడులు కూడా.. ‘యువగళం’ సీన్లు ఇవన్నీ

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో కాకపుట్టిస్తోంది. నేతల మధ్య దూషణలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాత కక్షలు భగ్గుమనడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పేద ప్రజల సమస్యలు తెలుసుకొని, కష్టాల్లో ఆదుకుంటామని చేపట్టిన పాదయాత్రలు విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీస్తున్నాయి. శ్రీశైలం నియోజకవర్గం నుంచి మొదలైన ఆరోపణలు, దాడులతో ఒక్కసారి ఉలిక్కిపడేటట్లు చేసింది. వేలాది ప్రజలు అభిమానంగా వస్తున్న యాత్రలో నాయకులపై విమర్శలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ని నారా లోకేష్ చీటింగ్ చక్రపాణి అని పేర్కొనడంతో విమర్శలు, ప్రతి విమర్శలు, ఛాలెంజులు, తిట్ల పురాణాలు, చెప్పు తెగేంత వరకు కొడతామనే మాటలు. మీ పెతాపమో నా ప్రతాపమో చేసుకుందామనే సినీ డైలాగ్స్ ..ఇవన్నీ చెప్పుకోవటం ఇక్కడ రొటీన్ గా మారుతోంది.

- Advertisement -

శిల్పా చక్రపాణి రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి లు ఒకరు ఆత్మకూరులో, మరొకరు నంద్యాలలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ, చెప్పులతో కొడతాం అంటూ ఛాలెంజులు విసురుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆలోచించే లోపే దాడి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీశైలం నియోజకవర్గం నుంచి నంద్యాల నియోజక వర్గంకు నారా లోకేష్ అడుగుపెట్టడంతో గతంలో మాజీమంత్రి అఖిల ప్రియ, విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిల మధ్య పాత గొడవలు మళ్లీ తెరపైకి వచ్చేసాయి. గతంలో సిరివేళ్ళలో కూడా ఏవి సుబ్బారెడ్డి పై దాడి జరిగింది. అప్పటి నుంచి భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే మండేది. ఈ నేపథ్యంలో నంద్యాల మండలం కొత్తపల్లి వద్ద నారా లోకేష్ కు మద్దతు ఇవ్వడానికి వచ్చిన భూమా అఖిల ప్రియ, ఆమె అనుచరులు, అలాగే ఏవి సుబ్బారెడ్డి ఆయన అనుచరులు ఒక్కసారిగా ఎదురుపడడంతో ఆగ్రహించిన ఇరు వర్గాల అనుచరులు దాడులకు తెగపడ్డారు. కొందరు ఏవి సుబ్బారెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షణాల్లో జరిగిన సంఘటనల నుంచి తేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి, ఏవి సుబ్బారెడ్డిని వాహనంలో ఎక్కించారు. రెప్పపాటు కాలంలో జరిగిన సంఘటన జిలా వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.

దీంతో నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డి వైద్య సేవలు నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా నా పై భూమా అఖిల ప్రియ అనుచరులతో దాడి చేయించింది ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం జరిగిన సంఘటలు పాదయాత్ర అనంతరం ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నంద్యాలలో శిల్పా రవి, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల ప్రియల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్దం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ నంద్యాల లో శిల్పా రవిపై ఎలాంటి ఆరోపణలు చేస్తారోనని స్థానికులు ఎదురుచూసేలా చేస్తోంది. ఎన్నికల వేళ పాదయాత్ర వేదికగా మళ్లీ పాత గొడవలు తెరపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయోనని స్థానికులు భయంతో వణుకుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News