Delhi High Court: అబార్షన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 33వారాల గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు అనుమతినిచ్చింది. ఓ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉండటంతో అబార్షన్‌కు హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నప్పుడు తల్లిదే తుది నిర్ణయమని కోర్టు స్పష్టం చేసింది. మెడికల్ బోర్డులు కూడా తల్లి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కోర్టు సూచించింది.
పుట్టబోయే బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ కావటంతో గర్భాన్ని తొలగించుకునేందుకు 26ఏళ్ల మహిళ కోర్టు అనుమతి కోరింది. అయితే అబార్షన్ ప్రతిపాదనను ఢిల్లీ ఎల్ ఎన్‌జేపీ ఆస్పత్రి వైద్యులు తోసిపుచ్చారు. తల్లికి ప్రాణాప్రాయం ఉంటుందంటూ కోర్టుకు వైద్యులు రిపోర్టును అందించారు. వైద్యుల నిర్ణయంపై పోరాడి హైకోర్టులో అబార్షన్‌కు మహిళ అనుమతి సాధించింది. పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితం అందాలని అభిప్రాయపడ్డ హైకోర్టు అబార్షన్‌కు అనుమతించింది. అబార్షన్ విషయంలో తుది నిర్ణయం మహిళలదే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో అసహజంగా, ఆరోగ్యంగా లేని గర్భస్థ శిశువుల విషయంలో మహిళలకు మరిన్ని హక్కులు కల్పించినట్లయింది.