Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: రోడ్డు భద్రతే ప్రాధాన్యత

Karimnagar: రోడ్డు భద్రతే ప్రాధాన్యత

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ముందుకు సాగుతున్నారని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. రోడ్డు, వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించడం, ఓవర్ లోడ్, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండటం వల్లనే ఎక్కువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నియమ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో మార్పు వచ్చేంత వరకు చర్యలు తీసుకునే పక్రియను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులు, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారు, మెకానిక్ లు, వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను వాహనాలకు బిగించే మెకానిక్ లపై కేసులు నమోదుచేస్తామన్నారు. శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించి రెండవసారి పట్టుబడిన వాహనదారుల వాహనాలను సీజ్ చేయడంతోపాటు, కేసులు నమోదుచేసి న్యాయస్థానాల్లో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను న్యాయస్థానం ద్వారా విడిపించుకోవడం అంతసులువు కాదని, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మద్యంసేవించి. వాహనాలు నడుపడం ద్వారా సదరు వాహనదారులతోపాటు, ఎదురుగా వచ్చే అమాయకులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది వాహనదారులతోపాటు ఎదురుగా వచ్చే అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగి ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దదిక్కులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోయాయని తెలిపారు. మరికొందరు తీవ్రగాయాలపాలై జీవచ్ఛవాలుగా మారి దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని వివరించారు. ఇన్ని రకాల అనర్ధాలకు కారణమతున్న మద్యం సేవించిన వాహనాలు నడుపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి రెండవసారి పట్టుబడిన వాహనదారులపై క్రిమినల్ కేసులతో పాటు మోటారు వాహనాల చట్టం కింద కేసులను నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో వారిని హాజరుపరిచిన సందర్భాలలో గతంలోని సంఘటనలు కూడా వివరించి, జైలుశిక్ష, జరిమాన విధించబడేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. గతంలో ఆటోమోబైల్ దుకాణాల యజమానులు, మెకానిక్ లతో నిర్వహించిన సమావేశంలో శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను విక్రయించకూడదని, మెకానిక్ లు బిగించవద్దని స్పష్టం చేశామని అయినా కొందరు విక్రయాలు జరుపడం, బిగించడం చేస్తున్నారని వాహనాలు పట్టుబడిన సందర్భాలలో వివరాలు సేకరించి ఆటోమోబైల్ దుకాణాదారులు, మెకానిక్ పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు వాహన యజమానులపై కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

ఆటోలో డ్రైవర్ సీటు పక్కన ప్రయాణీకుల కూర్చోనీయకూడదు*

ఆటోలో డ్రైవర్ పక్కన ప్రయాణీకులను కూర్చోనీయకూడదని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. డ్రైవర్ సీటు పక్కన అదనంగా బిగించిన సీట్లను తొలగించే చర్యలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. డ్రైవర్లు తమ పక్కన అదనంగా బిగించిన సీట్లను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. ఆటోడ్రైవర్లు తమపక్కన ప్రయాణీకులను కూర్చోబెట్టుకోవడం వల్ల ఏకాగ్రతను కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నేటినుండే ఆటోల్లో డ్రైవర్ పక్కన అదనంగా బిగించిన సీట్లను తొలగించే పక్రియను ప్రారంభించాలని పోలీసు అధికారులు కమీషనర్ ఆదేశించారు.

శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు తుక్కుతుక్కు*

ఈ మధ్యకాలంలో శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించిన వాహనాలు సుమారు 100 వరకు పట్టుబడ్డాయి. ఈ వాహనాలకు సంబంధించిన సైలెన్సర్లను గురువారం నాడు పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ప్రత్యక్ష్య పర్యవేక్షణలో రోడ్డు రోలర్ తో తొక్కించి తుక్కుతుక్కు చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి బిగించిన సైలెన్సర్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. శబ్దకాలుష్యంతో అనేక రకాల ప్రమాదాలు పొంచిఉన్నందున వాహనదారుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని కమీషనర్ చెప్పారు. శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను రెండవసారి బిగించి పట్టుబడిన వాహనాలు సీజ్ చేయడంతోపాటు మోటారు వాహనాల చట్టంతోపాటు, క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), యం భీంరావు (సిఏఆర్), ఏసిపిలు బి విజయ్ కుమార్, సి ప్రతాప్, ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జున రావు, పలువురు మెకానిక్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News