Team India : సాధారణంగా ఒకరిద్దరు క్రికెటర్ల బర్త్‌డేలు ఒకే రోజు వస్తేనే సోషల్ మీడియాలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాంటిది ఇద్దరు కాదు ముగ్గురు ఏకంగా నలుగురు స్టార్ ఆటగాళ్ల పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 6). పైగా వాళ్లంతా టీమ్ఇండియా క్రికెటర్లే కావడంతో సోషల్ మీడియా శుభాకాంక్షలతో మోతెక్కుతుంది. పేస్ గుర్రం బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ లు నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
బుమ్రా..
పేస్ గుర్రం బుమ్రా నేడు 29 పడిలోకి అడుగుపెట్టాడు. యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. బుమ్రా లేకపోవడంతో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లలో భారత బౌలింగ్ తేలిపోయింది. బుమ్రా త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని, వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ను అందించాలని కోరుకుంటున్నారు.
జడ్డూ..
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు రవీంద్ర జడేజా. నేడు 34వ వసంతంలోకి అడుగపెట్టాడు. ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంలో జట్టుకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ను ఆడలేదు. ఈ రెండు మేజర్ టోర్నీలలో ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు మిస్ అయిన ప్రతీసారి అభిమానులు.. జడ్డూ ఉంటే ఇలా జరిగేది కాదంటూ కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య తరుపున ప్రచారంలో పాల్గొన్నాడు.
శ్రేయస్ అయ్యర్..
మిగతా ఫార్మాట్లలలో అతడి ఆట ఎలాగున్న గత కొంతకాలంగా వన్డేల్లో స్థిరంగా రాణిస్తున్నాడు. వచ్చే ప్రపంచకప్‌లో నెంబర్ 4లో బరిలోకి దిగేందుకు తన వంతు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ ముంబై ఆటగాడు నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కివీస్ పర్యటనలో అదరగొట్టిన శ్రేయస్, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫర్వాలేదనిపించాడు.
టెస్టు స్పెషలిస్ట్ కరుణ్ నాయర్..
సెహ్వాగ్ తరువాత భారత తరుపున టెస్టుల్లో త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడా అంటే అది కరుణ్ నాయరే. 2016లో ఇంగ్లాండ్‌పై అతడు ఈ ఘనత సాధించాడు. అయితే.. నిలకడగా రాణించలేకపోవడం, రహానే, పుజారా వంటి ఆటగాళ్ల వల్ల టెస్టుల్లో అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పుజారా, రహానేలు రిటైర్‌మెంట్‌కు దగ్గర పడడంతో కరుణ్ నాయర్‌ను వచ్చే ఏడాది అయిన టెస్టుల్లో చూడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. నేడు 31వ వసంతంలోకి అడుగుపెట్టాడు.