KTR : మెట్రో పుణ్యమా అని నగరంలో కొంత దూరం వరకు అయినా ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగర వాసులు ప్రయాణం చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో మెట్రోను విస్తరించాలని ఎప్పుటి నుంచో నగరవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను పొడిగించాలని స్థానికులు కోరుతుండగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని కేటీఆర్ అన్నారు. ఎల్‌బీనగర్‌లో పలు అభివృద్ది పనులకు మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రెండో విడతలో నాగోల్-ఎల్బీ నగర్ మధ్య మెట్రో అనుసంధానించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతూ తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు.
పెంపుడు జంతువుల కోసం నిర్మించిన శ్మశాన వాటికను, బండ్లగూడ చెరువు నుంచి, నాగోల్ చెరువు వరకు నాలా బాక్స్ డ్రైన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు లింక్‌రోడ్డును మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభిచారు.