Friday, September 20, 2024
Homeహెల్త్Water therapy: అందాన్ని పెంచే నీటి థెరపీ

Water therapy: అందాన్ని పెంచే నీటి థెరపీ

తరచూ చర్మ సమస్యలతో మీరు డాక్టరు దగ్గరకు వెడుతున్నారా? ఆ చర్మ నిపుణులు మిమ్మల్ని‘నీళ్లు బాగా
తాగుతున్నారా?’ అని అడిగారా? ఈ ప్రశ్న చాలు ఎవరికైనా నీటికి, చర్మ ఆరోగ్యానికి ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి. నీరు లేని మనిషి జీవితం ఆలోచించలేము. శరీర జీవక్రియ కొనసాగడానికి, శరీర అవయవాలన్నీ సరిగా పనిచేయడానికి నీళ్లు అత్యావశ్యకం. అంతేకాదు నీరు పలు ఆరోగ్య సమస్యలను, బ్యూటీ సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. చర్మం విషయానికి వస్తే యాక్నే, పొడిచర్మం, నల్లమచ్చలు వంటి ఎన్నో చర్మ సమస్యలను నీరు పరిష్కరిస్తుంది.

- Advertisement -

శరీరంలో సరిపడినంత నీరు లేకపోతే చర్మం పొడిబారి పొట్టూడినట్ట అవుతుంది. బాగా ముడతలు పడుతుంది. చర్మంపై నల్లమచ్చలు వస్తాయి. చర్మం యొక్క ఎలొక్ట్రోలైట్ బ్యాలెన్స్, హైడ్రేషన్ లెవెల్స్ పడిపోకుండా ఎప్పుడూ పరిరక్షించుకుంటుడాలని వైద్యులు చెపుతున్నారు. నీరు బాగా తాగడం వల్ల చర్మం పట్టులా మ్రుదువుగా మారి మెరుపులు చిందిస్తుంటుందంటున్నారు. అంతేకాదు చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. నీటితో ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలను పొందుతాం. అందుకే ఇటీవల వాటర్ థెరపీకి ఆదరణ బాగా పెరిగింది. నీటి థెరపీ వల్ల బరువు తగ్గడమే కాకుండా జీవక్రియ బాగా జరుగుతుంది. నీరు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని పట్టులా అందాలు చిందించేలా చేస్తుంది. ఇది కూడా వాటర్ థెరపీకి బాగా ఆదరణ పెరగడానికి కారణమవుతోంది. వాటర్ థెరపీలో భాగంగా ఉదయం ఖాళీ కడుపుతో ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. చల్లటి నీరు కాకుండా గోరువెచ్చటి నీటినే తాగాలి. ఇలా నీళ్లు తాగిన తర్వాత 45 నిమిషాల పాటు ఏమీ తినకూడదు. తేలికపాటి వ్యాయామాలు, యోగ, నడక వంటివి మాత్రమే చేయాలి. లేదా నిత్యం ఇంట్లో చేసుకునే పనులు చేసుకోవాలి. కాఫీ లాంటి డ్రింకులను తాగకూడదు. అలా చేస్తే జీర్ణవ్యవస్థపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటర్ థెరపీతో పాటు ఆరోగ్యకరమైన డైట్ అలవాట్లు అనుసరించడం, రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన చర్మంతో ఎంతో అందంగా కనిపిస్తారు. తరచూ నీటిని తాగడం వల్ల చర్మానికి కావలసినంత నీరు అంది చర్మం మ్రుదువుగా తయారవుతుంది. చర్మం తేమను కోల్పోదు.

తాగే నీళ్లు తక్కువగా ఉంటే శరీరంలోనీటి పరిమాణం తగ్గి చర్మం ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అందుకే నీరు బాగా తాగాలి. అలాగే వాటర్ థెరపీ వల్ల స్కిన్ టెక్స్చెర్, టోన్ తొందరగా దెబ్బతినవు. పైగా చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, మెరుపులు చిందిస్తూ ఉంటుంది. నీరు తాగడం వల్ల కిడ్నీల్లోని మలినాలు బయటకు పోయి శుభ్రం అవుతుంది. ఫలితంగా శరీర అవయవాలకు స్వచ్ఛమైన రక్తంతో పాటు, ఆక్సిజన్ బాగా అందుతుంది. అలాగే శరీరంలోని అవాంఛనీయ మలినాలు బయటకు పోతే తప్ప చర్మం ప్రకాశవంతంగా ఉండదు. రక్త ప్రసరణ ద్వారానే చర్మం బలమైన పోషకాలను, ఆక్సిజన్ ను పొందగలదు. వీటివల్ల చర్మం ప్రకాశవంతంగాను, పట్టులా మ్రుదువుగా ఉంటుంది. చర్మం చేసే చాలా పనుల గురించి చాలమందికి స్పష్టమైన అవగాహన లేదు. శరీరంలోని నీరుపోకుండా చర్మం నిరోధిస్తుంది. శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను బయటకు పంపేస్తుంది. శరీరంలోని విటమిన్ డిని పరిరక్షించడంతో పాటు సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. నీరు బాగా తాగడం వల్ల స్కిన్ భౌతిక స్వభావం మెరుగుపడడమే కాకుండా చర్మం లోపలి వరకూ హైడ్రేషన్ అందుతుంది. అందుకే నీరు బాగా తాగడం అత్యావశ్యకమని చర్మనిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు బాగా తాగడం వల్ల చర్మం పలచదనంతో పాటు సరైన మందంతో ఉండి చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం వల్ల ముఖంలోని నీరు, నూనెల సమతుల్యత దెబ్బతినకుండా నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఎక్కువ నూనె స్రవించడం, చర్మరంధ్రాలు మూసుకుపోవడం, యాక్నేవంటి సమస్యలు తలెత్తవు. నీరు బాగా తాగడం వల్ల చర్మం బిగువును కోల్పోదు. శరీరం బరువు పెరిగితే చర్మం సాగుతుంది కాబట్టి ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం సాగదు.

నీరు చర్మాన్ని బిగువుగా ఉంచడంతో పాటు స్కిన్ టోన్ ను, మ్రుదుత్వాన్ని బాగా పెంచుతుంది. స్కిన్ పిహెచ్ ను పరిరక్షిస్తుంది. యాక్నే సమస్య ఉన్న చర్మాన్ని, సున్నితమైన చర్మాన్ని పరిరక్షిస్తుంది. శరీరంలోని పిహెచ్ ప్రమాణాలను సమతుల్యం చేస్తుంది. దీంతో చర్మం మెరవడంతో పాటు చర్మంపై ఎలాంటి మచ్చలు ఏర్పడవు. అయితే ఈ వాటర్ థెరపీని ఎవరికి వారు సొంతంగా చేసుకోకూడదు. అతిగా నీరు తాగితే శరీరంలోని పోషకాలన్నీ బయటకు పోయి శరీరం సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వాటర్ థెరపీ నిపుణులను సంప్రదించి తదనుగుణంగా థెరపీని పాటిస్తే అందం, ఆరోగ్యంతో కూడిన చర్మం మీ సొంతమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News