ఈనెల 25 నుండి 31 వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించ తలపెట్టిన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టంటు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రదేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించిన అష్టోత్తర శత కుండాత్మక శ్రీ చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అయితే వేసవి వడ గాల్పుల దృష్ట్యా భక్తులు ముఖ్యంగా వృద్దులు పిల్లలు పాల్గొనలేకపోయారన్నారు. ఈ అనుభవం దృష్ట్యా ఈనెల 25 నుండి 31 వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించవల్చిన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని పండితులతో సంప్రదించిన పిమ్మట, వారి సూచనల మేరకు పవిత్రమైన కార్తీకమాసంలో నిర్వహించాలని తలపెట్టడం జరిగిందని తెలియపర్చారు. మహాకుంభాభిషేకంలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేవిధంగా, పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో నిర్వహిస్తే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని భావిస్తున్నామని ఈ మార్పును భక్తులు గమనించాలని, ఎక్కువ మంది భక్తులు కార్తీక మాసంలో ప్రసిద్ధ శ్రీశైలం క్షేత్రంలో జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొనాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జ్యోతిష్యపండితుల ద్వారా ముహూర్తం నిర్ణయం చేసి త్వరలో తేదీని తెలియపరుస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు.