Friday, September 20, 2024
HomeఆటRohit Sharma : ఫామ్ కోసం రోహిత్ తంటాలు.. ఏం చేశాడంటే..?

Rohit Sharma : ఫామ్ కోసం రోహిత్ తంటాలు.. ఏం చేశాడంటే..?

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌.. ఒక‌ప్పుడు ఈ పేరును వింటే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు వ‌ణికిపోయేవారు. హిట్‌మ్యాన్‌కి ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డేవారు. చివ‌ర‌కు రోహిత్ బాదితులుగా మిగిలిపోయేవారు. అయితే.. ఇదంతా గ‌తం. ప్ర‌స్తుతం రోహిత్ త‌న కెరీర్‌లోనే అత్యంత గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. అటు కెప్టెన్‌గా ఇటు ఆట‌గాడిగా ఆశించిన మేర రాణించ‌డం లేదు. కెప్టెన్సీ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే.. బ్యాట‌ర్‌గా రోహిత్ దారుణంగా విఫ‌లం అవుతున్నాడు.

- Advertisement -

ఎప్పుడో ఒక‌సారి ప‌ర్వాలేద‌నిపించే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు త‌ప్పిస్తే.. త‌న‌దైన శైలిలో రోహిత్ చెల‌రేగి భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాల‌మే అయ్యింది. ఓపెన‌ర్ అయిన రోహిత్ త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరుతుండ‌డంతో మిగ‌తా వారిపై ఒత్తిడి ప‌డుతోంది. ఫామ్‌ను అందుకునేందుకు రోహిత్ శ్ర‌మిస్తుండ‌గా, కాస్త అదృష్టం తోడైతే మ‌ళ్లీ స‌త్తా చాటుతాడ‌ని అత‌డి అభిమానులు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ వికెట్ తేడాతో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంత‌రం ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో రోహిత్.. త‌న బ్యాట్‌తో కాకుండా సూర్య‌కుమార్ యాద‌వ్ బ్యాట్‌తో బ‌రిలోకి దిగాడు. 33 బంతులు ఎదుర్కొని 27 ప‌రుగులు చేసి ఔటైయ్యాడు. రోహిత్ ఆడే స‌మ‌యంలో అత‌ని బ్యాటు కింద భాగంలో ‘ఎస్ కే యాద‌వ్’ అనే అక్ష‌రాలు క‌నిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇది చూసిన నెటీజ‌న్లు..మళ్లీ ఫామ్ అందుకోవడానికి రోహిత్ నానా తిప్పలూ పడుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా రోహిత్ ఫామ్ అందుకుంటే చాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రోహిత్‌, సూర్య లు దేశ‌వాలీలో ముంబై జ‌ట్టు త‌రుపున ఆడారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున క‌లిసి ఆడుతున్నారు. మ‌రీ రెండో వ‌న్డేలో రోహిత్ ఏ బ్యాట్‌తో బ‌రిలోకి దిగుతాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News