North Korea: కొరియన్ డ్రామా మూవీస్ చూసినందుకు ఇద్దరు కుర్రాళ్లకు మరణ శిక్ష విధించింది ఉత్తర కొరియా. ఈ ఘటన గతవారం జరిగినట్లు తాజాగా వెల్లడైంది. ఉత్తర కొరియా–దక్షిణ కొరియా మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను పాలిస్తున్న నియంత కిమ్ జోంగ్ అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
కిమ్‌కు దక్షిణ కొరియా అన్నా, అమెరికా అన్నా అస్సలు పడదు. తన దేశంలో కనీసం వాటి పేర్లు కూడా వినిపించకూడదు. దేశ ప్రజలెవరూ అమెరికాకు చెందిన హాలీవుడ్ మూవీస్, కొరియన్ డ్రామాలు చూడకూడదనే నిబంధన విధించాడు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, గత అక్టోబర్‌లో ర్యాంగ్యాంగ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదువుతున్న 16, 17 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుర్రాళ్లు కొరియన్ డ్రామాలు, అమెరికన్ సినిమాలు చూశారు.
దీనిపై విచారణ జరిపిన ఉత్తర కొరియా అధికారులు ఇద్దరికీ మరణ శిక్ష విధించారు. అందరూ చూస్తుండగా, జనం మధ్యలో ఇద్దరికీ మరణ శిక్ష అమలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దీనిపై ఒక ప్రకటన చేసింది. ఇద్దరు కుర్రాళ్లు చేసిన నేరం చాలా తీవ్రమైనదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇద్దరి మరణ శిక్షను నేరుగా చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉత్తర కొరియాలో ఇలాంటి కఠిన చట్టాలు చాలా అమలు చేస్తుంటారు.
గత ఏడాది కిమ్ జోంగ్ తండ్రి వర్ధంతి సందర్భంగా అక్కడ కొద్ది రోజులు సంతాప దినాలు ప్రకటించారు. సంతాప దినాలు ముగిసే వరకు అక్కడ ఎవరూ నవ్వడం, షాపింగ్ చేయడం, మందు తాగడం చేయకూడదనే నిబంధన విధించారు.