తేజపత్తా…అదేనండి బిర్యానీ ఆకు లేని బిర్యానీని ఊహించుకోవడం అసాధ్యం. ఈ ఆకు లేకపోతే బిర్యానీకి ఆ సువాసన రాదు. బిర్యానీకి ఉండే విలక్షణమైన ఆ రుచీ కరవువుతుంది. అంతేకాదు బిర్యానీ ఆకు వల్ల మనం పొందే ప్రయోజనాలు కూడా ఎన్నో. దీనివల్ల వైద్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యను ఇది తగ్గిస్తుంది. దెబ్బతిన్న జీర్ణవ్యవస్థకు తగిన సాంత్వననిస్తుంది. ఈ ఆకులోని కొన్ని ఎంజైములు కారణంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఈ ఆకు గాస్టోఇంటస్టైనల్ సిస్టమ్ బాగా పనిచేసేట్టు తోడ్పడడమే కాదు శరీరంలోని మలినాలను సైతం బయటకు పంపేస్తుంది. బిర్యానీ ఆకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేజపత్తా (బిర్యానీ ఆకు) లో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి.
అన్నంలో రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవడం వల్ల శరీరంలోని వాపు సమస్య తగ్గుతుంది. ఈ ఆకు నుంచి తయారుచేసిన నూనెను మోకాళ్లకు, కీళ్లకు రాసుకుంటే నొప్పి నుంచి మంచి సాంత్వన లభిస్తుంది. బిర్యానీ ఆకు నుంచి తయారు చేసిన నూనెను వాసన చూడడం వల్ల శ్వాస సమస్యను అధిగమించగలం. అంతేకాదు ఊపిరితిత్తులలోని కఫం కరగడమే కాకుండా బాక్టీరియా కూడా నశిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు తేజపత్తా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులో బోలెడు యాంటాక్సిడెంట్లతో పాటు లినాలూల్, కేట్ చిన్స్ వంటి కాంపౌండ్లు ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. కాన్సర్ నివారణలో కూడా తేజపత్తా మంచి వైద్య మూలికగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటారు. అరోమాథెరపీలో భాగంగా ఒత్తిడి, యాంగ్జయిటీ వంటి సమస్యలను నివారించేందుకు పలు ఎసెన్షియల్ ఆయిల్స్ లో తేజపత్తా నూనెను ఉపయోగిస్తారు.
బిర్యానీ ఆకులు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫంగస్, బాక్టీరియా వంటి వాటి నుంచి సోకే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా తేజ పత్తా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడమే కాకుండా జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. రాత్రి ముందు తేజపత్తా తీసుకుంటే నిద్రను తెప్పించే మైల్డ్ ట్రాక్విలైజర్ లాగ ఈ ఆకు పనిచేస్తుంది. శరీరానికి రిలాక్సేషన్ ఇచ్చి నిద్ర వచ్చేలా చేస్తుంది. అందుకే నిద్ర పట్టనపుడు కొంచెం నీటిలో తేజపత్తా నూనె చుక్కలు కొన్ని వేసి ఆ నీటిని తాగితే మంచిదంటారు ఆయుర్వేద నిపుణులు.
ఈ ఆకు ఎక్స్ ట్రాక్ట్స్ ను సబ్బులు, సెంట్లు, దంత ఉత్పత్తుల్లో సైతం వాడుతుంటారు. వెంట్రుకల్లో తలెత్తిన చుండ్రు సమస్యను కూడా తేజపత్తా ఆయిల్ తగ్గిస్తుంది. జుట్టు రాలిపోకుండా సంరక్షిస్తుంది. వెంట్రుకలు బాగా పెరిగేలా తోడ్పడుతుంది. పలు నేచురల్ స్కిన్ కేర్ చికిత్సల్లో భాగంగా తేజ్ పత్తాను హెర్బల్ చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు కూడా. తేజ్ పత్తా నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి తగ్గుతాయి. ఈ ఆకును తరచూ వాడడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేసి బరవు తగ్గుతాం. ఈ ఆకు రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను పోగొడుతుంది. రెండు లేదా మూడు తేజపత్తా ఆకులు తీసుకుని చిన్న ముక్కలుగా చేసి ఉడికిన నీళ్లల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచి ఆ నీటిని వడగట్టుకుని తాగాలి. దాల్చినచెక్క, తేజపత్తా కలిపి చేసిన టీ తాగడంవల్ల బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని కొవ్వును బాగా కరిగిస్తుంది.
శరీరంలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను శరీరంలో వ్రుద్ధిచేస్తుంది. ఈ టీ తయారు చేయాలంటే దాల్చిన చెక్క ఒక ముక్క తీసుకోవాలి. లేదా ఒక టీస్పూను దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి. తేజపత్తా మూడు లేదా నాలుగు ఆకులు తీసుకోవాలి. తేనె ఒక టీస్పూను (ఆప్షన్), నీళ్లు మూడు లేదా నాలుగు కప్పులు తీసుకోవాలి. ఒక గిన్నెలో ఆ నీటిని మరిగించాలి. అందులో తేజపత్తా, దాల్చినచెక్క లేదా దాల్చినచెక్కపొడి వేయాలి. పది నుంచి ఇరవై నిమిషాల సేపు ఆ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత దాన్ని ఒడగట్టి అందులో తేనె వేసుకుని తాగితే శరీరానికి ఎంతో మంచిది. నిద్రలేమి సమస్య ఎదుర్కొనేవారు రాత్రి పడుకోబోయే ముందు తేజ్ పత్తా టీ తాగొచ్చు.