సౌదీ అరేబియాకు చెందిన యంగ్ పరిశోధకురాలు రయ్యానా బర్నావీ చరిత్ర స్రుష్టించారు. స్పేస్ ఎక్స్ కు చెందిన విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకుని ఈ రికార్డు నెలకొల్పిన తొలి సౌదీ మహిళగా నిలిచారు. ఆమె గురించిన కొన్ని విశేషాలు…
బర్నావీ ఇపుడు సౌదీ అరేబియా ప్రజలకు ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఆసక్తికర వ్యక్తి అయ్యారు. బర్నావీ పాల్గొన్నరోదసీ మిషన్ పై వీరందరి చూపులు నిలిచాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రోదసి పర్యాటకురాలిగా కాలిడిన బర్నావీ తన కల నిజమైందని ఆనందిస్తున్నారు.ఈ రోదసి అంతరిక్ష కేంద్రంలో ఆమె తన బ్రుందంతో కలిసి పది రోజులు గడుపుతారు. ఆమెతో పాటు రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్సు కు చెందిన యుద్ధ విమాన పైలెట్ ఆలీ అల్ కర్నీ, అమెరికాకు చెందిన కోటీశ్వరుడు జాన్ షాప్నర్, నాసా విశ్రాంత వ్యోమగామి పెగ్గీ విట్సన్ లు కూడా రోదసీ పర్యాటకులుగా అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. తనకు వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోనున్నట్టు బర్నావీ గతంలో ఒక పత్రికతో మాట్లాడుతూ అన్నారు.
సౌదీ అరేబియా దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళల కలలకు ప్రతిరూపంగా, వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తానని బర్నావీ అన్న మాటలు మరవలేం. ఈ అపూర్వ అవకాశం తనకు దక్కడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బర్నావీ అన్నారు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ముస్లిం మహిళ కూడా బర్నావీ. ఏక్స్ 2 ఐఎస్ ఎస్ కు రెండవ ప్రైవేట్ ఆస్ట్రనాట్ మిషన్ ఇది.
బర్నావీ బయోమెడికల్ అధ్యయనకారురాలు. కాన్సర్ స్టెమ్ సెల్స్ పరిశోధనలో దశాబ్దకాలం విశేషానుభవం ఉన్న వ్యక్తి. ఈ రోదసి యాత్రలో బర్నావీ కీలకపాత్ర పోషించనున్నారు. ఎఎక్స్- 2 మిషన్ లో భాగంగా స్టెమ్ సెల్, బ్రెస్ట్ కాన్సర్ అధ్యయనంలో బర్నావీ ప్రత్యేక ద్రుష్టిని కేంద్రీకరించనున్నారు. అంతేకాదు విద్య, పిల్లల్లో ఆసక్తిని రేపేందుకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (ఎస్ టి ఇఎం) రంగాల పరంగా క్రూ చేబట్టిన పలు కార్యకలాపాల్లో బర్నావీ కూడా పాలుపంచుకుంటారు. ఒక పరిశోధకురాలిగా తనకు లభించిన ఈ రోదసి యాత్ర అవకాశం భవిష్యత్ తరాలకు ఎంతో స్పూర్తివంతంగా నిలుస్తుందని బర్నావీ అంటారు.
అరేబియా పట్ల ఉన్న కన్సర్వేటివ్ ఇమేజ్ ను చెరిపేసే అతి పెద్ద మలుపు బర్నావీ రోదసి పయాణం అని చెప్పాలి.
33 సంవత్సరాల యంగ్ బర్నావీ అరేబియన్ స్పేస్ మిషన్ లో భాగస్వామి కావడం ఆ దేశ యువతకే కాదు ప్రపంచంలోని మహిళలందరకీ దక్కిన అపురూపమైన గుర్తింపు, గౌరవమని చెప్పాలి. బయోమెడికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని న్యూజిలాండ్ లోని సుప్రసిద్ధమైన ఒటాగో యూనివర్సిటీ నుంచి బర్నావీ తీసుకున్నారు. బయోమెడికల్ సైన్స్ లో మాస్టర్స్ పట్టాను రియాద్ లోని ఆల్ఫైసల్ యూనివర్సిటీ నుంచి పొందారు. కాన్సర్ స్టెమ్ సెల్స్ పరిశోధనలో దశాబ్దకాలం విశేషానుభవం బర్నావీకి ఉంది. గతంలో ఒక రీసెర్చ్ లేబరెటరీలో టెక్నీషియన్ గా కూడా బర్నావీ పనిచేశారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మిషన్ ప్రయోగాల్లో బర్నావీ కీలకంగా వ్యవహరించారు. స్పేస్ ఫాల్కాన్ 9 రాకెట్ లో అంతరిక్షంలోకి దూసుకుపోయిన బర్నావీ రోదసిలో కాలుపెట్టిన ముస్లిం మహిళగా ఖ్యాతిని పొందారు. సౌదీ అరేబియాకు చెందిన తొలి మహిళా వ్యోమగామిగా రికార్డు స్రుష్టించారు. సౌదీ మహిళలు కోరుకుంటున్న లింగ సమానత్వానికి స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాదు మిషన్ కు చెందిన పలు ప్రయోగాలలో కీలక భాగస్వామిగా వ్యవహరించనున్నారు. సౌదీ అరేబియా మహిళల హక్కకుల విషయంలో కరుడుగట్టిన కన్ సర్వేటివ్ ఇమేజ్ ను కలిగి ఉన్న సౌదీ దాన్ని ఛేదించే ప్రయత్నానికి చేబట్టిన సంస్కరణల్లో మహిళను రోదసికి పంపించడం కూడా ఒకటని పలువురు అభిప్రాయపడుతున్నారు కూడా.
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ లో ముందుండాలనే ఆకాంక్షతో ఈ మిషన్ లో సౌదీ పాలుపంచుకుంది. తద్వారా మానవాళికి అపూర్వ సేవలు అందించాలని పూనుకుంది. అంతేకాదు అంతరిక్ష పరిశ్రమలో మంచి అవకాశాలు పెంపొందించడానికి సౌదీ పూనుకొంది.
బర్నావీ రోదసిలో కాలుపెట్టిన తొలి ముస్లిం మహిళ కాదు. బర్నావీకి ముందు 2006లో ఇరాన్- అమెరికన్ అయిన అనౌషే అన్సారీ అంతరిక్షంలో కాలుపెట్టిన తొలి ముస్లిం మహిళ. 2006లో స్పేస్ టూరిస్టుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అన్నారీ కాలుమోపారు. సౌదీ అంతరిక్ష ప్రయాణంలో బర్నావీ ప్రవేశం నూతన శకంగా చెప్పాలి. పొరుగున ఉన్న ఆరబ్ ఎమిరేట్స్ 2019లో తమ దేశ పౌరుడిని మొదటిసారి అంతరిక్షానికి పంపిన విషయం తెలిసిందే. అదే బాటలో నూనెగనుల సంపదకు పేరుగాంచిన సౌదీ అరేబియా అంతరిక్ష రంగం దిశగా తన అడుగులు వేయడం విశేషం. అయితే దీనికి ముందే ఇలాంటి ఒక ప్రయత్నం జరిగింది. 1985లో సౌదీ రాయల్ ప్రిన్స్, ఎయిర్ ఫోర్స్ పైలెట్ అయిన సుల్తాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అమెరికా ఆధ్వర్యంలో చేబట్టిన స్పేస్ మిషన్ లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించిన తొలి ఆరబ్ ముస్లింగా రికార్డులకెక్కారు.
ఆక్సియోం మిషన్ 2(ఎఎక్స్2)లో మిషన్ స్పెషలిస్టుగా బర్నావీ వ్యవహరించారు. అంతేకాదు తొలిసారి ఒక మహిళ స్పేస్ మిషన్ కార్యకలాపాలను ముందుండి నడిపించడం చెప్పుకోవలసిన మరో విశేషం. సౌదీ అరేబియాలోని జెద్దాలో 1988లో బర్నావీ జన్మించారు. ప్రొఫెషనల్ గానే కాకుండా బయట బర్నానీ పాల్గొన్న పలు ఇతరత్రా కార్యకలాపాలు సైతం ఆమెకు రోదసి మిషన్ లో పాలుపంచుకునే అవకాశాన్ని
అందిచ్చాయి. బర్నావీకి క్రీడలంటే చాలా ఇష్టం. అవుట్ డోర్ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తి . ప్రపంచంలోని పలు సాహస కార్యకలాపాల్లో సైతం బర్నావీ పాలుపంచుకున్నారు. సౌదీ అరేబియా, ఇండొనేసియాలలో స్కూబా డైవింగ్ సాహసాలు చేశారు. హ్యాంగ్ గ్లైండింగ్, లెడ్జింగ్ స్విమ్మింగ్ లలో దిట్ట. న్యూజిలాండ్ లో ఇలాంటి సాహసాలు ఎన్నో చేశారు. అంతేకాదు టర్కీలో హైకింగ్, రాఫ్టింగ్ లలో సైతం పాల్గొని తన సత్తా చాటారు. నింగి, నేలానే కాదు చివరకు అంతరిక్షాన్నీ బర్నావీ జయించారు.. అలాంటి యంగ్ బర్నావీ గ్లోబల్ మహిళలకు ఎంత స్పూర్తో వేరే చెప్పాలా?