మామునూరు ఎయిర్ పోర్టు భూముల కేటాయింపుపై మంత్రి ఎర్రబెల్లిని కలిశారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. మామునూరు ఎయిర్ పోర్టుకు మరికొంత స్థల కేటాయింపుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చర్చించారు. వరంగల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న మామునూరు ఎయిర్ పోర్టు భూమికి అదనంగా 253 ఎకరాల భూమిని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు కేటాయిస్తే, మామునూరు ఎయిర్ పోర్టును ఎ-320 తరహాలో అభివృద్ధి చేయడానికి వీలవుతుందని వారు అడుగుతున్నారన్నారు. దీనికనుగుణంగా ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ చేసిన గూగుల్ సర్వే ద్వారా వరంగల్ కోట మండలం నక్కలపల్లి, గాదెపల్లి, మామునూరు ల పరిధిలో అక్కడి రైతులకు చెందిన 249.33 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. అయితే, పీవీ నర్సింహారావు పశు సంవర్థక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న373.02 ఎకరాల మామునూరు ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న డైరీ భూములను వరంగల్ కోట తాహసిల్దార్ కు అప్పగించే విధంగా చేస్తే, అందుబాటులోని భూ యజమానులైన రైతులకు పరిహారంగా ఇవ్వడానికి వీలవుతుందని, ఫలితంగా వారి భూమిని మామునూరు ఎయిర్ పోర్టుకు కలపడానికి ఉంటుందని కలెక్టర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి, సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు.