కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్ పల్లి X రోడ్డులో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు స్వర్గీయ యన్ టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కేపి వివేకానంద, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, NTR అభిమానులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ.. యుగపురుషుడు నందమూరి తారకరామారావు అన్నారు. రాజకీయాలలో ఆయన ప్రవేశం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, 1983 కు ముందు కాంగ్రెసు పార్టీలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ అదిష్టానం ముందు మొక్కాల్సిన పరిస్థితి ఉండేదని, అప్పట్లో ఢిల్లీలో మనలను మద్రాసు వారు అనేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం, పేదల బాగు కోసం NT రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 లో స్థాపించారు. సినీ నటుడు అయిన NTR గారి రాజకీయ ప్రవేశంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయిందన్నాకుయ
1983 ఎన్నికలలో సంచలనంగా ఘనవిజయం సాధించారని, నా రాజకీయ జీవితం NT రామారావు గారి ఆశిస్సుల తోనే మొదలైందన్నారు పోచారం. ప్రేమ కలిగితే కుల మతాలకు అతీతంగా అందరినీ దగ్గరకు తీసుకునే మంచి మనసు NT రామారావుదని, మనిషి గంభీరంగా ఉన్నా మనస్తత్వం చిన్న పిల్లాడి లాంటిదని, రాజకీయాలు వ్యాపారం కాదని రాజకీయం అంటే ప్రజా సేవ అని రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ప్రస్తుత నాయకులలో సగం మంది NT రామారావు ఆశిస్సులతోనే రాజకీయల లోకి వచ్చారన్నారు.
దేశంలో సంక్షేమ రంగం ప్రారంభం అయింది NT రామారావుతోనేనన్న పోచారం..2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పక్కా ఇళ్ళు కట్టించడం, వ్యవసాయ కరంటు మోటార్లకు స్లాబ్ రేట్ సిస్టం వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. NT రామారావు గారి స్పూర్తితోనే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు పోచారం.