Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Act to protect Doctors: డాక్టర్ల రక్షణకు సమగ్ర చట్టం

Act to protect Doctors: డాక్టర్ల రక్షణకు సమగ్ర చట్టం

దేశంలో డాక్టర్ల మీద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షకుల రక్షణకు ఒక సమగ్ర చట్టాన్ని తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నాయి. డాక్టర్లపై దాడులకు సంబంధించి 2012 నుంచి ఇప్పటి వరకు ఒక్క కేరళలోనే 469 కేసులు నమోదు కాగా, దేశంలో 2016 నుంచి ఇప్పటి వరకు 9,656 కేసులు నమోదయినట్టు అధికారిక అంచనా. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో డాక్టర్లపై దాడులు అనేక రాష్ట్రాలలో అడ్డూ ఆపూ లేకుండా విజృంభించాయి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో సైతం వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళక కలిగిస్తోంది. డాక్టర్ల మీదే కాకుండా అనేక రాష్ట్రాలలో ఆస్పత్రుల మీద కూడా దాడులు జరిగాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ మధ్య కాలంలో 70 సార్లు ఆస్పత్రులను విధ్వంసం చేయడం జరిగింది.కేరళలో ఈ మధ్య కొందరు ఒక ఆస్పత్రి మీద మారణాయుధాలతో దాడి చేసి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక శిక్షణలో ఉన్న డాక్టర్‌ని దారుణంగా హత్య చేయడంతో కేరళ ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. వెంటనే ఒక ఆర్డినెన్సును జారీ చేసింది. ఆస్పత్రుల మీదా, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మీదా ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, అయిదు లక్షల రూపాయల జరిమానా విధించడానికి వీలు కల్పించే ఈ ఆర్డినెన్స్‌ మీదరెండు వారాల క్రితం కేరళ గవర్నర్‌ సంతకం పెట్టడం కూడా జరిగింది. కనీస శిక్ష సంవత్సరం కారాగారవాసం, లక్ష రూపాయల జరిమానా.
ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మీద దాడి చేసి వారిని కొట్టడమే కాదు, తిట్టినా అది శిక్షార్హమే అవుతుంది. ఫిర్యాదు అందిన 24 గంటల లోగా పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.సబ్‌ఇన్స్‌పెక్టర్‌ కంటే పైస్థాయి పోలీస్‌ అధికారి దర్యాప్తు జరిపి, ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసిన 60 రోజుల లోగా నిందితులను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది.గడువు లోగా కేసు దర్యాప్తును ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సి ఉంటుందని కూడా చట్టం పేర్కొంటోంది. కోవిడ్‌ కంటే ముందు తక్కువ కేసులే నమోదు అయినప్పటికీ, కోవిడ్‌ సందర్భంగా మాత్రం దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ డాక్టర్ల మీద దాడులు జరిగినట్టు పోలీస్‌ రికార్డులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఇటువంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అయినట్టు పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక రాష్ట్రంలో డాక్టర్లు ఆందోళన చేయడం, ధర్నాలుచేయడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి పత్రికలకు ఎక్కుతూనే ఉన్నాయి. కేరళతో పాటు దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాలు డాక్టర్ల రక్షణకు చట్టాలు తీసుకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది. నిజానికి డాక్టర్లు కేంద్ర స్థాయిలోనే ఒక చట్టం కోసం డిమాండ్‌ చేయడం జరుగుతోంది.
మొట్టమొదటగా స్పందించిన రాష్ట్రం మాత్రం కేరళ అని చెప్పవచ్చు. తమపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో తమకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు కోరుతున్నారు. కేరళతో సహా వివిధ రాష్ట్రాలలో ఇదే విధమైన చట్టాలు అమలులోకి వచ్చాయి. డాక్టర్లపై దాడులు చేసిన వారిని శిక్షించడం సమంజసమే కానీ, ఈ చట్టాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించడం, వారిని అన్ని విధాలా కాపాడడం వంటి చట్టాల వల్ల రోగులు పూర్తిగా డాక్టర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు అంటున్నారు. ఈ చట్టాలను సరైన విధంగా ఉపయోగించని పక్షంలో రోగుల ఆందోళనలను, ఆవేదనలను తప్పుగా అర్థంచేసుకోవడం, వారు ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడే ప్రతి మాటనూ దాడిగానే పరిగణించడం జరుగుతుందని ఆరోగ్య సంబంధమైన ఉద్యమ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నందువల్ల, ప్రభుత్వందీన్ని ఆచితూచి ఉపయోగించక తప్పదని, ఇది డాక్టర్లకు రక్షణ కల్పిస్తూనే అదే సమయంలో రోగుల హక్కులను కూడా కాపాడాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు.
రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చికిత్సలలో పొరపాట్లు చేయడం, రోగుల పట్ల వివక్షతో వ్యవహరించడం వంటివి జరగడం కూడా సర్వసాధారణమైపోయిందని, డాక్టర్లంతా రోగుల పట్ల సమభావంతో వ్యవహరిస్తున్నారని చెప్పలేమని వారు వాదిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణిస్తున్న రోగుల సంఖ్యతో పోలిస్తే డాక్టర్లపై దాడుల సంఖ్య తక్కువే ఉండవచ్చన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. నిజానికి, కోవిడ్‌ సమయంలో ఇటువంటి కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి దుర్ఘటనలు అనేకం జరుగుతున్నాయని ఆరోగ్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, రోగుల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమపడే డాక్టర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం మాత్రం అనివార్యమని, తప్పకుండా చట్టపరంగా వారు రక్షణ పొందాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News