పసుపుతో ముఖఛాయ ఎంతో పెరుగుతుంది. అంతేకాదు మరెన్నోచర్మ సమస్యలను సైతం పసుపు తగ్గిస్తుంది. పసుపుతో చేసిన కొన్ని రకాల ఫేస్ మాస్కులు ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడదు. ఈ మాస్కులను ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు. పసుపుతో చేసిన ఫేస్ మాస్కుతో చర్మం మెరుపు పెరుగుతుంది.
ఈ మాస్కు తయారీకి అర టీస్పూన్ పసుపు పొడి, ఒక టేబుల్ స్పూను పాలు, అర టీస్పూను తేనె తీసుకుని ఆ మూడింటినీ మిశ్రమంలా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖంపై, మెడ భాగంలో పూసుకుని అది బాగా ఆరిపోయేదాకా అంటే 20 నిమిషాలు పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లనీళ్లతో ముఖం బాగా కడుక్కోవాలి. అలాగే చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు కూడా పసుపుతో ప్రత్యేకమైన ఫేస్ మాస్కును చేసుకోవచ్చు. ఇందుకోసం అర టీస్పూను పసుపు పొడి, ఒక టేబుల్ స్పూను పెరుగు, అర టీస్పూను నిమ్మరసం తీసుకుని బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి, మెడ
భాగంలో రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకొని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.
ఫేషియల్ హెయిర్ పోవడానికి కూడా ప్రత్యేకమైన పసుపు ఫేస్ మాస్కు ఉంది. దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల పసుపుపొడి,ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, కొద్దిగా నిమ్మరసం తీసుకుని ఆ మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖంపై, మెడపై పూసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో మ్రుదువుగా తయారయి చూడడానికి యంగ్ గా, మరింత అందంగా కనిపిస్తారు. యాక్నేతో బాధపడే వాళ్లను కూడా చాలామందిని చూస్తుంటాం. వీరు పసుపుతో చేసిన ఫేస్ మాస్కును ముఖానికి రాసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడతారు. ఈ మాస్కు తయారీ కోసం రెండు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్, అర టీస్పూను పసుపు పొడి తీసుకుని ఆ మిశ్రమాన్ని పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖంపై, మెడ భాగంపై అప్లై చేసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవాలి.
వేసవిలో ఎక్కువమంది సన్ ట్యాన్ తో బాధపడుతుంటారు. దీనిని నివారించేందుకు పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ ఉంది. దీని తయారీకి ఒక టేబుల్ స్పూన్ టొమాటో ప్యూరీ, అర టీస్పూను పసుపుపొడి, ఒక టేబుల్ స్పూను పెరుగు తీసుకుని మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల వరకూ ఆరనివ్వాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. పసుపుతో చేసే ఈ ఫేస్ మాస్కులను ఉపయోగిస్తూ శుద్ధమైన, అందమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోండి…నలుగురిలో ప్రత్యేకంగా కనపడండి… ఏమంటారు?