జమ్మికుంట మున్సిపల్ పరిధి 22వ వార్డులోని పాత వ్యవసాయ మార్కెట్ నుంచి అంబేద్కర్ కాలనీ కి వెళ్లే రహదారిలో మూడు రోడ్ల కూడలి వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతను మూడేళ్లుగా మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కళ్లకు గంతలు కట్టుకొని చేతిలో ప్లే కార్డులతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల క్రితం అకాల వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు వెళ్లేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రహదారిపై గుంతను తవ్వి వరద నీరును వెళ్లేలా చేశారని సదర స్థలంలో మరమ్మత్తు పనులు చేయకపోవడంతో ఆ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు మూడేళ్లుగా నిత్యం ప్రమాదం పొంచి ఉందన్నారు. వర్షం కురిసిన ప్రతిసారి మురుగు కాలువ నీరు ఇండ్లలోకి చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్ ఇట్టి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.