Pawan Kalyan : జనసేన పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకోసం ఓ ప్రచార రథాన్ని సిద్దం చేయించారు. ఈ వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి సిద్దమైంది’ అంటూ వాహనం మొక్క వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వాహనంలో హై సెక్యూరిటీ సిస్టమ్‌తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్, ప్రముఖులతో చర్చలకు వీలుగా ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉన్నాయి.
ఈ వాహనం ట్రయల్ రన్‌ను పవన్ కళ్యాణ్ ఈ రోజు(బుధవారం) హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించిన కొన్ని సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు చేశారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ పవన్ మాట్లాడారు.
వాస్తవానికి పవన్ యాత్ర దసరా తరువాత ఉంటుందని చెప్పారు. అయితే.. అది కార్యరూపం దాల్చలేదు. 2023కు వాయిదా పడింది. వచ్చే సంవత్సరం మొదట్లోనే పవన్ యాత్ర ఉండే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తం తిరిగి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.