Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Ease of doing business: కేంద్ర ప్రభుత్వం సాధించిందేమిటి?

Ease of doing business: కేంద్ర ప్రభుత్వం సాధించిందేమిటి?

అధికారానికి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్రహ్మాండమైన వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ సాఫల్యాలను ప్రజల ముందుంచుతోంది.ఒక పక్క కోవిడ్‌, మరొకపక్క ఆర్థిక మాంద్యంతో పాటు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, భారతదేశ ప్రగతి పురోగమనం చెందుతోందే తప్ప తిరోగమనం చెందకపోవడాన్ని ఇది ఒక చిన్న పుస్తకం ద్వారా ముఖ్యంగా ప్రస్తావించింది. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అంశాలను మాత్రం ఎంచుకుని, అనేకానేక ఆర్థిక సమస్యలను ప్రజల నుంచి దాచే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు, విశ్లేషకులు చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఇందులో సమాధానాలు లభించాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో భారతదేశ ర్యాంకు అగ్ర స్థాయిలో ఉందని, డిజిటలీకరణలో అగ్ర రాజ్యాలకన్నా ముందుకు దూసుకుపోతోందని, ప్రాథమిక సదుపాయాల కల్పనలో కూడా చాలావరకు పురోగతి సాధిస్తోందని, ఎగుమతులు పెరిగాయని, విదేశీ పెట్టుబడులు కూడా వృద్ధి చెందాయని అది ఈ చిన్న పుస్తకంలో గణాంక వివరాలతో సహా పేర్కొంది. అంతేకాక, దేశం అతి వేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఎస్‌.టి, డి.బి.టి, ఐ.బి.సి వంటి సంస్కరణల గురించి కూడా అది విపులంగా తెలియజేసింది.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన సాఫల్యాలు, విజయాల గురించే తప్ప, వైఫల్యాలు, అపజయాల గురించి బయటపెట్టుకోవడం, ప్రచారం చేసుకోవడం జరగదు. అందులోనూ మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇటువంటి అవివేకపు చర్యకు పాల్పడడం అసలే జరగదు. అయితే, విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు కూడా నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని ఆశించలేం. నిష్పాక్షికంగా నిగ్గు తేల్చే నిపుణులు లేదా విశ్లేషకులు ప్రస్తుత ప్రపంచంలో చాలా అరుదనే చెప్పాలి. ప్రభుత్వ సాఫల్యాలను మరుగుపరచి, వైఫల్యాలను భూతద్దంలో చూపించడానికే వీరు విశేషంగా కృషి చేస్తుంటారు. ఏతావతా, అసలు విషయాలు లేదా అసలు వాస్తవాలు అంత త్వరగా వెలుగు చూసే అవకాశం ఉండదనే చెప్పాలి. ఏది ఏమైనా, కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఈ రిపోర్ట్‌ కార్డును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తలసరి జి.డి.పి విషయంలో భారతదేశం కాంగో, బంగ్లాదేశ్‌ వంటి సాధారణ దేశాలతో సమానంగానే ఉంది. నిజానికి, బంగ్లాదేశ్‌ భారత్‌ కంటే రెండు అడుగులు ముందుంది. ఇక భారతదేశంలో పేదల జనాభా మొత్తం జనాభాలో 25 శాతం వరకూ ఉంటుంది.అసమానతలు పెరుగుతున్నాయి. రూ. 25,000, అంతకు మించి సంపాదించే కార్మికుల సంఖ్య పది శాతం మాత్రమేనని చెప్పవచ్చు.
దేశంలో అత్యధిక శాతం జనాభాకు ఆరోగ్య సంరక్షణ, విద్య అనేవి చాలావరకు సుదూర స్వప్నాలే. ఇక ఉత్పత్తి, ఎగుమతులు, స్థూల మూలధనం వంటి విషయాల్లో 2008-14 ముందు నాటి పరిస్థితే ఎంతో మెరుగ్గా ఉంది.ఈ ఏడాది జి.డి.పిలో ఉత్పత్తి రంగ వాటా 14 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.ఎగుమతులు కూడా జి.డి.పిలో 22 శాతానికి మించి పెరగడం లేదు.కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను 77 వేల కోట్ల డాలర్లుగా చూపించింది.ఎగుమతులు పెరిగిన మాట నిజమే కానీ, దీన్ని పూర్తి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అంచనా వేయాల్సి ఉంది. భారత్‌ ఇప్పటికీ దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగానే ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2047 నాటికి భారత్‌ సంపన్న దేశంగా గుర్తింపు పొందాలన్న పక్షంలో తలసరి ఆదాయం ఇప్పుడున్న దాని కన్నా ఆరు రెట్లు పెరగాల్సి ఉంటుంది.విశ్లేషకులు 2020 ప్రారంభం నుంచి విజృంభించిన కోవిడ్‌, ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమెరికా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ఈ మూడింటి ప్రభావంతో కుంగి కృశిస్తున్న సమయంలో కూడా భారత్‌ నిబ్బరంగా, పటిష్ఠంగా పురోగతి సాధిస్తుండడాన్ని వారు పట్టించుకోవడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News