Saturday, November 23, 2024
Homeహెల్త్Water Therapy: సన్నబడేందుకు నీళ్లు తాగితే సరి!

Water Therapy: సన్నబడేందుకు నీళ్లు తాగితే సరి!

బరువును తగ్గించే జపాన్ వాటర్ థెరపీ..
జపాన్ వాటర్ థెరపీ గురించి విన్నారా? దీనిని క్రమపద్ధతిలో అనురిస్తే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతామని నిపుణులు అంటున్నారు. మీ ఆరోగ్యం బాగండాలంటే నిత్యం తగినన్ని నీటిని తాగాల్సిన అవసరాన్ని ఈ థెరపీ తెలియచెప్తుందంటున్నారు. జపాన్ వాటర్ థెరపీని అనుసరించడం వల్ల జీవక్రియ శక్తివంతం అవుతుంది. ఉదయం లేచిన వెంటనే ఎక్కువ నీటిని తాగడంతో రోజును ప్రారంభించాలని ఈ థెరపీ చెప్తుంది.

- Advertisement -

ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లను తాగాలి. ఈ వాటర్ థెరపీని జపాన్ వాళ్లు ఎంతో క్రమశిక్షణతో అనుసరిస్తారు. దీనిని పాటించడం వల్ల బరువు బాగా తగ్గుతారు. ఫిట్ నెస్ తో ఉంటారు. జీర్ణశక్తి బాగుండకపోవడం వల్లే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జపాన్ వాటర్ థెరపీ ప్రధానంగా స్టొమక్ క్లీనింగ్ కి ప్రాధాన్యం ఇస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా ఈ థెరపీ తోడ్పడుతుంది. ఉదయమే వాకింగ్ చేసిన అనంతరం మంచినీళ్లు బాగా తాగాలని జపాన్ సంప్రదాయ వైద్యవిధానం సైతం చెప్తోంది.

ఇదే గోల్డెన్ అవర్..

జపాన్ ప్రజలు ఉదయం వేళలను గోల్డెన్ అవర్స్ గా భావిస్తారు. తెల్లారకట్టే మంచినీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సులభంగా అయి బరువు తగ్గుతారని వాళ్లు గట్టిగా నమ్ముతారు. ఈ అలవాటు వల్ల శరీరంలోని ఇతర జబ్బులు కూడా తగ్గుతాయి. జపాన్ వాటర్ థెరపీ ప్రధానంగా చెప్పేదేమిటంటే పొద్దున్న లేచీ లేవగానే ఖాళీ కడుపుతో నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు తాగాలి. అది కూడా గోరువెచ్చటి నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్లను మాత్రమే తాగాలి. ఈ నీళ్లల్లో తాజా నిమ్మకాయ రసం పిండుకుని తాగితే మరింత మంచిదంటారు. మంచినీళ్లు తాగిన తర్వాతే పళ్లు తోముకోవాలి. ఆ తర్వాత కనీసం 45 నిమిషాల వరకూ ఏమీ తినడం గానీ, తాగడం గానీ చేయకూడదు. ఆ తర్వాత డైలీ రొటీన్ ను కొనసాగించవచ్చు. రోజులో ఆహారం తీసుకున్న ప్రతి సారీ కనీసం రెండు గంటల వరకూ ఏమీ తినడం గానీ తాగడం గానీ చేయకూడదు. పెద్దవాళ్లు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లయితే రోజూ ఉదయం ఒక గ్లాసు నీళ్లను తాగడంతో మొదలెట్టి మెల్లమెల్లగా ఎక్కువ గ్లాసుల నీరు తీసుకోవాలే తప్ప ఒకేసారి అధికంగా నీరు తాగకూడదు. వరుసగా ఎక్కువ గ్లాసులు నీరు తాగడానికి ఇబ్బంది పడేవాళ్లు గ్లాసు నీళ్లు తాగి రెండు మూడు నిమిషాలు ఆగి మళ్లీ ఇంకో గ్లాసు నీళ్లు తాగడం చేయాలి. ఇలా చేయడం వల్ల
వికారంతో బాధపడరు.

ఇవి గుర్తుంచుకోండి..

జపాన్ వాటర్ థెరపీని అనుసరించేవాళ్లు ముఖ్యంగా కొన్ని విషయాలను గమనంలో పెట్టుకోవాలి. వీళ్లు రోజుకు గంట సేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అలాగే రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లతో నోటిని నాలుగైదుసార్లు పుక్కిలించాలి. ఒకసారి తిన్న తర్వాత మధ్య మధ్యలో మళ్లీ తినడం, తాగడం వంటివి చేస్తే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలా చేయద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహారాన్ని బాగా నమిలి మింగితే సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి ఈ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలంటున్నారు.ఇలా జపాన్ వాటర్ థెరపీని పాటిస్తే పొందే లాభాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఒత్తిడి నుంచి రిలాక్సు అవుతాం.

బరువు తగ్గుతాం. జీర్ణక్రియ ద్రుఢంగా తయారవుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మరింత ఎనర్జిటిక్ గా ఉంటాం. పగటి వేళలో నీరు తరచూ తాగడం వల్ల కూడా జీవక్రియ మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే శరీరాన్ని బాధిస్తున్న ఎన్నో అనారోగ్య సమస్యలు పోతాయని జపాన్ వాటర్ థెరపీ నిపుణులు నొక్కిచెపుతున్నారు. ఇలా నీరు తాగడం వల్ల నీటి ద్వారా శరీరంలో పేరుకుని ఉన్న విషతుల్యమైన మలినాలు బయటకు పోయి శరీరం ఎంతో ఆరోగ్యంతో ఉంటుందంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News