Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: జిల్లా ఖ్యాతిని దేశంలో చాటి చెప్పాలి

Karimnagar: జిల్లా ఖ్యాతిని దేశంలో చాటి చెప్పాలి

వేసవి క్రీడల శిక్షణలో చిన్నారుల ఆసక్తి, ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందం వేసిందని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో నగరపాలక సంస్థ ద్వారా అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మంగళవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించి వివిధ క్రీడా శిక్షణ తరగతులను పరిశీలించారు. క్రికెట్, వాలీబాల్, షెటీల్, కిక్ బాక్సింగ్, కరాటే, ఫుట్ బాల్ లాంటి క్రీడల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో కోచ్ లు ఇస్తున్న శిక్షణ పై చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ యాదగిరి సునీల్ రావు చిన్నారులతో కలిసి క్రికెట్, షెటిల్, వాలీబాల్, ఫుట్ బాల్ ఆడారు. సమ్మర్ క్యాంపు ద్వారా వివిధ క్రీడల్లో చిన్నారులు నేర్చుకున్న శిక్షణను స్వయంగా పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ ద్వారా అందించే పౌష్టికాహారమైన గుడ్డు, అరటి పండ్లు, పాలను చిన్నారులకు అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహద పడుతాయన్నారు. ప్రతి విద్యార్థికీ జీవితంలో విద్యతో పాటు క్రీడలు కూడా చాలా ప్రాముఖ్యమని, క్రీడలు భవిష్యత్తులో రాణించేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. కరీంనగర్ నగరంలో వివిధ క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను తయారు చేసేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చొరవతో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిభిరాలను నిర్వహిస్తూ దాదాపు 32 క్రీడా అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. దాదాపు 80 మంది కోచ్ లను నియమించి పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో మెలుకువలు నేర్పించడంతో పాటు శిక్షణ సమయంలో పౌష్టికాహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించి కరీంనగర్ జిల్లా నుండి మంచి క్రీడాకారులగా తయారవ్వాలన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఈ సంవత్సరం కూడా వేసవిలో క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని, ఈ రోజు స్వయంగా వివిధ క్రీడలను పరిశీలించి విద్యార్థులు నేర్చుకున్న మెళకువలను పరీక్షించడం జరిగిందన్నారు. సమ్మర్ క్యాంపులో క్రీడల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులను చూస్తుంటే చాలా ఆనందం వేస్తోందన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి వారంతా ఎంపిక చేసుకున్న క్రీడలో ఉత్సాహంగా పాల్గొని ఆసక్తితో క్రీడల్లో నైపుణ్యం పెంచుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారుల క్రీడల నైపుణ్యం చూస్తుంటే చాలా సంతోషం వ్యక్తమైందన్నారు. సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందుతున్న 3 వేల మంది చిన్నారుల్లో కొంత మంది అయినా మంచి క్రీడాకారులుగా ఎదిగి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా తయారైతే తమ కృషికి తగిన ఫలితం లభిస్తుందన్నారు. 30 రోజుల పాటు వ్యయ ప్రయాసాలకు ఓర్చి క్రీడా సంఘాలు, కోచ్ ల సహకారంతో క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల ఉత్సాహంతో పాటు వారి మాటలు వింటుంటే చాలా సంతోషం వేసిందన్నారు. తప్పకుండా కరీంనగర్ నగరంలో ఎలాంటి స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ అయినా నగరపాలక సంస్థ పూర్తిస్థాయిలో పాల్గొని ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సౌకర్యాలు కల్పించినప్పటికీ ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని క్రీడాకారులు కోరడం జరిగిందన్నారు. వారి కోరిక ప్రకారం జౌట్ డోర్ షెటీల్ కోర్ట్స్, వాలీబాల్ కోర్టు, ఇతర సౌకర్యాలు కూడా త్వరలోనే కల్పిస్తామని స్పష్టం చేశారు.

వాకింగ్ చేసుకునే వారికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చక్కని వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్పోర్ట్స్ కు సంబంధించిన కార్యక్రమాలు నగరపాలక సంస్థ ద్వారా ఇంకా గొప్పగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులకు తగిన సదుపాయాలు కల్పించి వారు క్రీడల్లో మంచి గుర్తింపు సాధించే విధంగా తమ నగరపాలక సంస్థ కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమ్మర్ క్యాంపులో క్రీడల్లో శిక్షణ పొందుతున్న ప్రతి చిన్నారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతిరోజు వారిని గ్రౌండ్ కు ఓపికతో తీసుకొచ్చి క్రీడల్లో శిక్షణ ఇప్పించడం చాలా సంతోషకరమన్నారు. కరీంనగర్ నుండి రాబోయే రోజుల్లో వివిధ క్రీడల్లో మంచి క్రీడాకారులు తయారై జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని దేశంలో చాటి చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములు, పలు క్రీడల కోచ్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News