కెసిఆర్ హయాంలోనే గ్రంధాలయాల అభివృద్ధి జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంధాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జూబ్లిహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్ పేటలో రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రంధాలయ భవన పనులను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్నదని అన్నారు. విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంధాలయాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించకపోవడం, సౌకర్యాలు, వసతుల గురించి పట్టించుకోని కారణంగా గ్రంధాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో ఉన్న గ్రంధాలయాలలో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మరమ్మతులు చేపట్టడం, శిధిలావస్థలో ఉన్న, అద్దె భవనాలలో కొనసాగుతున్న 14 గ్రంధాలయాలకు రూ.9.40 కోట్ల వ్యయంతో నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ప్రధాన గ్రంధాలయాలలో ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గ్రంధాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ గ్రంధాలయాలు పరిసరాల ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్యదర్శి పద్మజ, స్థానిక నాయకులు ప్రదీప్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.