Friday, November 22, 2024
Homeహెల్త్Covid-hair fall: కరోనాతో జుట్టు రాలుతోందా?

Covid-hair fall: కరోనాతో జుట్టు రాలుతోందా?

అందానికి చిట్కాలు…

- Advertisement -

 కోవిడ్ తర్వాత చాలామంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను మందులతో కాకుండా సహజసిద్ధమైన పద్ధతితో నివారించుకోవచ్చు. ముఖ్యంగా కరివేపాకు, కొబ్బరినూనె, మెంతులతో తగినంత బలాన్ని శిరోజాలకు అందించి జుట్టును రాలిపోకుండా కాపాడుకోవచ్చు.

ఇందుకోసం నాలుగు టీస్పూన్ల మెంతులు, గుప్పెడు కరివేపాకు, ఓ కప్పు తాజా కొబ్బరి నూనె తీసుకుని చిన్న మంట మీద పదినిమిషాలు ఉడికించాలి. ఇలా మరిగించిన నూనెను చల్లార్చి సీసాలో పోసి రెండు రోజుల వరకూ వాడకూడదు. తర్వాత వారానికి రెండుసార్లు ఈ నూనెను కుదుళ్లకు బాగా పట్టించి జుట్టును సున్నితంగా మునివేళ్లతో మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు శిరోజాలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

 మెడ నలుపుదనంతో చాలామంది బాధపడుతుంటారు. దీనికి కూడా సహజసిద్ధమైన వంటింటి చిట్కా ఒకటి ఉంది. ముందుగా మెడ చుట్టూ వెన్న రాసి అరగంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత ఒక స్పూను స్వర్ణముఖి ఫేస్ వాష్ ను నీళ్లతో బాగా కలిపి పేస్టులా చేసి దాన్ని మెడ చుట్టూ పూయాలి. అలా పూసిన తర్వాత మెడను పావుగంట సేపు అలాగే వదిలేసి బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మెడను కాసేపు మసాజ్ చేసి నీటితో మెడను కడిగేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు కుంకుమాది తైలాన్ని మెడకు
రాయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మెడ చుట్టూ పేరుకుని ఉన్న నల్లదనం పోయి మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు మెడ చూడడానికి ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది.
 కాలిమర్దనాతో మంచి నిద్ర పడుతుంది. దీనికి మనం చేయాల్సిందేమిటంటే ఒక బకెట్ లో గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. అందులో దంచిన అల్లం, చెంచా ఉప్పు వేసి రెండూ బాగా కలిసేలా చేయాలి. ఆ నీటిలో పగిలిన పాదాలను పావుగంట సేపు ఉంచి తర్వాత పొడి గుడ్డతో పాదాలను శుభ్రంగా తుడవాలి. తర్వాత కాళ్లకి కొద్దిగా కొబ్బిరి నూనె లేదా ఆవనూనె రాయాలి. పదినిమిషాల తర్వాత కాళ్లను గుడ్డతో శుభ్రపరిచి కొద్దిగా మాయిశ్చరైజర్ ని పాదాలకు రాయాలి. సబ్బు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వాడొద్దు. వారంలో రెండు లేదా మూడుసార్లు ఇలా చేస్తే నిద్ర బాగా పడుతుంది.
 తాటి ముంజలు శరీరంలోని మలినాలను బయటకు పంపడమే కాదు మొటిమలు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి.
 రాత్రి పడుకునే ముందు వేడి చేసిన కొబ్బరి నూనెను పాదాల పగుళ్లకు పూసి సాక్స్ వేసుకోవాలి. ఉదయం ఆ సాక్సులను తీసేసి గోరువెచ్చని నీళ్లల్లో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. తర్వాత పగుళ్ల వద్ద మెల్లగా బ్రష్ తో శుభ్రం చేయాలి. అంతేకాదు ఆముదం, రోజ్ వాటర్, నిమ్మరసాలను సమపాళ్లల్లో తీసుకుని బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని పాదాలు పగిలిన చోట రోజుకు రెండు లేదా మూడుసాలు రాస్తే పాదాలపగుళ్లు పోతాయి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేస్తే మంచి ఫ్రభావం
కనిపిస్తుందని బ్యూటీ నిపుణులు అంటున్నారు.
 తలలోని చుండ్రును తగ్గించే వంటింటి చిట్కా ఒకటి ఉంది. దీనికి మనం చేయాల్సిందల్లా పావు కప్పు కొబ్బరినూనె, పావుకప్పు నిమ్మరసం తీసుకుని బాగా కలిపి మిశ్రమాన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపుతో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరినూనె శిరోజాలకు పోషణనిస్తే, నిమ్మరసం తలలోని చుండ్రును తగ్గిస్తుంది.
 గ్లాసు నీళ్లల్లో రెండు స్పూన్ల టీపొడి వేసి మరిగించి అందులో ఒక చెంచాడు మందారపొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇక వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే కూడా ఒక కిటుకు ఉంది. ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీస్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి.
 స్నానం చేసే నీళ్లల్లో కొద్దిగా ఉప్పు, నిమ్మ రసం వేసి కలిపి స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి.
 కొబ్బరినూనె, పిప్పర్మెంట్ ఆయిల్, బేకింగ్ సోడాను కలిపి పేస్టులా తయారుచేసుకుని దానితో రోజూ పళ్లు తోముకుంటే ఎంతో మంచిదని కొందరు వైద్యులు సైతం సూచిస్తున్నారు.
 నిమ్మరసంలో కాస్తంత ఇంగువను వేసి కొద్దిగా వేడిచేసి దూదితో పంటిపైన పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
 ముఖంపై మచ్చలు పోవాలంటే ఉల్లిరసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడగాలి. వారంపాటు ఇలా చేస్తే ముఖంపై ఏర్పడ్డ నల్ల మచ్చలు పోవడంతో పాటు ముఖం నిగ నిగ లాడుతుంటుంది.

 ఒక స్పూను మెంతులను రాత్రంతా నానబెట్టి మర్నాడు వాటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమానికి తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇది ఆరిపోయే వరకూ ముఖాన్ని అలాగే ఉంచుకుని తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ ముఖంలో వయసు ముదురుతున్న ఛాయలు కనిపించవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News