సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర అంటూ గుర్తుచేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్రని, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథి హాజరైన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. టీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. “ఆర్టీసీ ఉద్యోగులు 2011, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు 29 రోజులపాటు సకల జనుల సమ్మెను కొనసాగించారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె ఉదృతమైంది. విజయవంతం కూడా అయింది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది.” అని అన్నారు. అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపారని కొనియాడారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యోగులు చైతన్యపరిచారని గుర్తు చేశారు. కొందరు ఉద్యోగులు తమ పాటలు, రచనలు, నాటకాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని.. రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉద్యోగులు నిలవడం సంస్థకు గర్వకారణమని ప్రశంసించారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో గత 9 ఏళ్లలో టీఎస్ఆర్టీసీలో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ప్రజల ప్రోత్సాహం, అదరాభిమానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ టీఎస్ఆర్టీసీ ముందుకు దూసుకుపోతోందని, భవిష్యత్ లోనూ మరెన్నో కార్యక్రమాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ప్రజల సహకారం, ఉద్యోగుల కృషితో టీఎస్ఆర్టీసీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాల్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ విజయ్ కుమార్, సీటీఎం జీవనప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.