శ్రద్ధ వాకర్.. ఇప్పుడు దేశంలో ఈ పేరు, ఈమె హత్యోదంతం గురించి తెలియని వారుండరు. తన లివ్ ఇన్ పార్టనర్ అఫ్తాబ్ ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ ఈ కేసు గురించి తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ నిందితుడిని ఉరితీయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. కేసు నమోదైంది మొదలు.. అఫ్తాబ్ విచారణలో రోజుకో సంచలన విషయం బయటికొచ్చింది. హత్య జరిగి ఆరునెలలు కావడంతో.. ఆమె శరీర భాగాలకు సంబంధించిన కళేబరాలే లభ్యమయ్యాయి.
ఇక ఇటీవల అఫ్తాబ్ కు నార్కో అనాలసిస్ టెస్టు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో శ్రద్ధను తానే హత్య చేసి, 35 ముక్కలు చేసి హత్యచేసినట్లు అంగీకరించాడు. వాటిని సుమారు మూడు వారాల పాటు ఫ్రిజ్ లో దాచి, అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాలలో విసిరేసినట్లు వెల్లడించారు. ఇక తాజాగా అఫ్తాబ్ శ్రద్ధను చంపడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. మరో అబ్బాయితో ఒక రాత్రంతా గడిపినందునే శ్రద్ధను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. డేటింగ్ యాప్ బంబుల్ ద్వారా శ్రద్ధకు ఓ కుర్రాడితో పరిచయం ఏర్పడిందని, అతడిని కలిసేందుకు మే 17వ తేదీన గురుగ్రామ్ వెళ్లిందని వెల్లడించాడు. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్న శ్రద్ధ మరుసటి రోజు మధ్యాహ్నానానికి ఫ్లాట్ కు తిరిగి వచ్చిందని పేర్కొన్నాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి, మాటమాటా పెరగడంతో క్షణికావేశంలో ఆమెను హత్య చేశానని చెప్పాడు.
అఫ్తాబ్ చెప్పిన విషయాలు నిజమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు శ్రద్ధ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అతడు చెప్పింది నిజమేనని గుర్తించారు. బంబుల్ యాప్ ద్వారా ఓ యువకుడితో పరిచయం, అతడితో ఒక రోజంతా గడపడం పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యాయి. శ్రద్ధాతో గడిపిన ఆ యువకుడి వివరాలను పోలీసులు సేకరించారు. కానీ.. అతడి పేరును బయటపెట్టలేదు.