Sunday, October 6, 2024
HomeతెలంగాణJivan Reddy: గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం

Jivan Reddy: గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం

కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ గోల్కొండ కోటపై గోల్ మాల్ తతంగం నడిపిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి క్షుద్ర రాజకీయం చేశారని మండి పడ్డారు. కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, పదేళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై విషం కక్కడానికే మొత్తం సమయాన్ని కేటాయించారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
పదేళ్ళలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఇక ముందు ఏమిస్తుందో చెప్పకుండా కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు వల్లెవేస్తూ సొల్లు పురాణం వినిపించారని ఆయన విమర్శించారు. “అధికార వేదికపై ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని కిషన్ రెడ్డి. ఆయనగోల్కొండ కోటపై దర్శనమిచ్చిన గోబెల్స్ అవతారం.
కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తెలంగాణలో కనపడే టూరిస్టు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నాయో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎంత పంట పండుతుందో, ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో తెలియదు. బీజేపీ నాయకులది చదువురాని సన్నాసుల సంఘం. ఈ సంఘానికి అధ్యక్షుడు మోడీ అయితే ఉపాధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి తొండిమాటల బండిసంజయ్ కాగా నిజామాబాద్ జిల్లా అష్ట దరిద్రపు ఎంపీ అరగుండు అరవింద్ కార్యదర్శి. వీరి చదువులు ఫేక్, వీళ్ల వ్యవహారం ఫ్రాడ్. వీరు చెప్పేది ఫాల్స్. అందుకే ఈ చదువురాని మొద్దులకు తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్రం రాక ముందు తెలంగాణ ఎట్లుంది?. రాష్ట్రం అయిన ఈ పదేండ్లలో ఎట్లుంది? అని నాడు-నేడు పేరుతో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దేశమే గర్వపడుతున్న తెలంగాణ మోడల్ గురించి రోజుకొక సబ్జెక్ట్ పై వివరించే కార్యక్రమాన్ని మేం నిర్దేశించుకున్నాం. దీన్ని ఓర్వలేక బీజేపీ కొత్తగా కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపింది. కిషన్ రెడ్డి చిత్రీకరించినట్టు తెలంగాణ అప్పుల కుప్పకాదు, అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రం. వాస్తవానికి బీజేపీయే దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. 14 మంది ప్రధాన మంత్రులు రూ. 56 లక్షల కోట్ల అప్పులుచేస్తే ఒక్క మోడీ ప్రభుత్వమే రూ.80లక్షల కోట్ల అప్పులు చేసింది.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయిందన్న కిషన్ రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అన్న నిజం ఆయనకే తెలుస్తుంది. తెలంగాణ దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందన్న కిషన్ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ టాప్ అని కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఎందుకిస్తున్నదో తెలుసుకోవాలి. ధరణి, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలపై కిషన్ రెడ్డి కండ్లలో నిప్పులు పోసుకున్నాడు అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,మేయర్ నీతూ కిరణ్ , నుడా చైర్మన్ ప్రభాకర్,మాజీ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి మరియు నిజామాబాద్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News