తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన సభలో ప్రసంగిస్తూ, 9 ఏండ్ల అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. ప్రజా భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల అధికారుల సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపామని అన్నారు. పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాగిన స్వరాష్ట్ర సాధన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శుభాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు.
“తెలంగాణ ఆచరిస్తుంది,దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. కెసిఆర్ మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి కలయిక అయిన ‘తెలంగాణ మోడల్’ నేడు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నదన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగిందని, సంక్షోభ సమయాలలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ,పట్టణ,నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం అన్నారు.