Sunday, October 6, 2024
HomeతెలంగాణSrinivas Goud: రికార్డు టైంలో రాష్ట్ర ప్రగతి

Srinivas Goud: రికార్డు టైంలో రాష్ట్ర ప్రగతి

తొమ్మిది ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ లో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి సందేశమిస్తూ తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, ధాన్యం కొనుగోలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ, దళిత బంధు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సామాజిక వర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం, జిల్లాకో మెడికల్ కళాశాల వంటివి ఎన్నో అమలు చేసి దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నదని, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకున్నదని అన్నారు.

ఒకప్పుడు కరువు జిల్లా వలసల జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు పచ్చని పంటలకు నిలయంగా ఉందని, పాలమూరులో దొరికే వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు పాలమూరు కు వలస వస్తున్నారంటే జిల్లా సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవాలని అన్నారు .వ్యవసాయ రంగంతో పాటు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, సంక్షేమం, తదితర అన్నీ రంగాలలో మహబూబ్నగర్ జిల్లా గడచిన 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహకరించాలని కోరారు.
అనంతరం మంత్రి వివిధ శాఖల ద్వారా ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సందర్శించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ,దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులు కోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, డిసిసిబి ఇన్చార్జి అధ్యక్షులు కొరామోని వెంకటయ్య, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,జిల్లా గొర్రెల కాపరుల పెంపకం సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News