గోల్డ్ ఫేషియల్ అనగానే ఇదేదో చాలా కష్టమైనది అని మనలో చాలామంది అనుకుంటాం. కానీ దీన్ని ఇంట్లోనే ఎంతో సులువుగా చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి ముందర ముఖాన్ని పాలతో శుభ్రం చేసుకోవాలి. కాటన్ బాల్ తీసుకుని దాన్ని పాలల్లో ముంచి దాన్ని ముఖంపై బాగా పూసి బాగా ఆరనివ్వాలి. ఆతర్వాత ముఖానికి స్క్రబ్బర్ అప్లై చేయాలి. ఇందుకోసం షుగర్, తేనె, నిమ్మరసాలను తీసుకుని ఆ మూడింటినీ బాగా కలిపి మిశ్రమంలా చేసి దాన్ని ముఖానికి పట్టించుకోవాలి. అది బాగా ఆరిపోయే వరకూ అంటే 20 నిమిషాల పాటు ముఖంపై అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం బాగా కడుక్కోవాలి. మూడవ స్టెప్ లో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఇందుకు ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని వాటిని బాగా వేడి చేసి ఆ వేడి నీటితో ముఖాన్ని ఆవిరి పట్టుకోవాలి.
నాల్గవ స్టెప్ లో ముఖానికి ఫేస్ మాస్కు పెట్టుకోవాలి. ఇందుకుగాను కొబ్బరినూనె, తేనె, పసుపు, నిమ్మరసం, పెరుగులను తీసుకుని బాగా కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించుకోవాలి. అది బాగా ఆరిపోయేవరకూ అంటే అరగంట దాకా దాన్ని ముఖానికి అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అంతే మీ ముఖం బంగార వన్నెతో మెరిసిపోతుంది. చూసేవారికి మీరు ఎంతో అందంగా, మరెంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ కన్నులపండువ చేస్తారు. మరి ఆలస్యం ఎందుకు గోల్డ్ ఫేషియల్ ని మీ ఇంట్లోనే ఇలా చేసేసుకోండి… ఏమంటారు?