Gujarat Election Result: దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ప్రధాని సొంతరాష్ట్రంలో మరోసారి బీజేపీ హవా కొనసాగుతుంది. గుజరాత్ లో మొత్తం 182 సీట్లకు 155 సీట్లలో బీజేపీ దూసుకుపోతోంది. ఇక గెలుపు నామమాత్రమే. గుజరాత్ లో ట్రైయాంగిల్ పోటీ ఉన్నా బీజేపీ హవామాత్రం తగ్గలేదు. మరికొన్ని గంటల్లో తుది ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ ఫలితాలు భారత ప్రధాని నరేంద్రమోడీ పాలన తీరుకు అద్ధంపట్టబోతున్నాయి. గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే 5 రాష్ట్రాల్లో ఒక లోక్ సభకు, ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఇప్పటికే గుజరాత్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీచేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీ సాధించారు. ఇక, గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 30 స్థానాలను కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు.
గుజరాత్ రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. గతంలో 2002లో 182 మంది సభ్యుల అసెంబ్లీలో 127 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగినా.. అధికారం మాత్రం కమలం పార్టీదే అవుతూ వస్తుంది. అయితే, ఈసారి ఆప్ రంగంలోకి దిగడంతో త్రిముఖంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మాత్రం బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేయగా ఇప్పుడు అదే నిజమవుతుంది. ఒకరకంగా విపక్షాల ఓట్ల చీలిక బీజేపీకి కలిసి వచ్చినట్లే భావించాలి. మొత్తంగా గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో దేశంలో ఇంత కాలం నిరంతరాయంగా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక పార్టీ బీజేపీ అవుతుంది.