Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP: చంద్రబాబు జిల్లాల పర్యటన.. వైసీపీ ఎదుర్కొనేదెలా?

TDP: చంద్రబాబు జిల్లాల పర్యటన.. వైసీపీ ఎదుర్కొనేదెలా?

- Advertisement -

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు రోజులపాటు ఈ పర్యటన సాగనుంది. గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం, బాపట్ల జిల్లా బాపట్లలో శుక్రవారం, చీరాలలో శనివారం
చంద్రబాబు పర్యటన సాగనుంది. గతవారం మూడు రోజుల్లో ఆరు నియోజకవర్గాలను చుట్టొచ్చిన చంద్రబాబు, ఈ వారం మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడు చేపడుతున్న ఈ పర్యటనకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు.

గత వారం పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతోనే ఈ వారం పర్యటన మొదలు పెట్టినట్టు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. జనాల నుండి స్పందనతో చంద్రబాబు మరింత ఉత్సాహంతో ప్రజల మధ్యకు వెళ్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ వారం కూడా చివరి రోజు శనివారం చీరాలలో రోడ్ షో, బహిరంగసభకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అసలు ప్రజల నుండి టీడీపీ చెప్పుకుంటున్న స్థాయిలో స్పందన వస్తుందా? అధికార పార్టీ వైసీపీపై.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలలో అంత వ్యతిరేకత ఉందా అన్నది రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే.. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలలో భారీ వ్యతిరేకత కనిపించడం లేదనే చెప్పాలి. అభివృద్ధి, రాజధాని, అప్పులు, సౌకర్యాల కల్పన, వ్యవసాయ రంగానికి రాయితీలు వంటి విషయాలలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కొంత వ్యతిరేకత కనిపిస్తుండగా.. సంక్షేమ పథకాల అమలులో కొంతమేర అస్ఫతృప్తి ఉన్నా టీడీపీ చెప్పుకొనే స్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదు. కానీ.. ఏ స్థాయిలో ఉన్నా అది ఎన్నికల సమయానికి ఏ మేర ప్రభావం చూపిస్తుందన్నదే రాజకీయ పార్టీలకు అవసరం. ఎలాగూ ప్రతిపక్షంలోనే ఉండడంతో చంద్రబాబు ఇప్పటి నుండే ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునే సన్నాహాలు మొదలు పెట్టారు.

దీనిని వైసీపీ ఎలా తిప్పికొడుతుందన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు రాష్ట్రంలో ఏం జరిగినా అన్నిటికీ గత ప్రభుత్వమే కారణమని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు టీడీపీ ప్రజల్లో రేకెత్తించే ప్రతి అంశాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలి. మొన్నటి వరకు ఏది జరిగినా మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరూ మూకుమ్మడిగా టీడీపీపై మాటల దాడి చేసేవారు. కానీ.. ఈ మధ్య కాలంలో అది కాస్త తగ్గింది. బహుశా అలాంటి దాడులు ఇంకా వ్యతిరేకత పెంచే అవకాశం ఉందని వైసీపీకి అర్ధమైందేమో. మరి ఇప్పుడు చంద్రబాబు పర్యటనను ఎలా ఎదుర్కుంటారు?.. ఎలా తిప్పికొడతారన్నది ఇక వేచిచూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News