సమాజంలో శాంతిస్థాపన కోసం ఎన్నో సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పోలీసులు అందిస్తున్న సేవల వల్లనే నేడు సమాజం ప్రశాంతంగా వర్ధిల్లుతోందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ నేడు శాంతియుతంగా వర్ధిల్లేందుకు పోలీసులు అందించిన సేవలు నిలువెత్తు సాక్ష్యాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు ఆదివారం నాడు “సురక్ష దినోత్సవం” పేరిట పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయింబవళ్ళు అలుపెరుగకుండా నిర్వహిస్తున్న సేవల ఫలితంగా లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండుకుంటున్నాయన్నారు. కరుడుగట్టిన నేరస్థులు, అసాంఘిక శక్తులపై పిడియాక్ట్ లను అమలు చేయడం ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తున్నాయని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ ల నిర్వాహణతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, ఎంతోమంది ప్రాణాలు రక్షించబడుతున్నాయని చెప్పారు. లేక్ పోలీస్ ఏర్పాటుతో మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. డ్యాంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన వందలాదిమందిని రక్షించి, వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ లు నిర్వహిస్తూ అందిస్తున్న సేవలను అభినందించారు. కరోనా విజృంభన సమయంలో పొలీసులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించారని కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. వినియోగంతో ఎలాంటి నేరాలైన త్వరితగతిన ఛేదించబడుతున్నాయని చెప్పారు. ఆసుపత్రిలో బాలిక అపహరణ, పలు రోడ్డు ప్రమాదాలు, పలు సంచలనాత్మకమైన సంఘటనలు చేధించడిన విషయాన్ని ఉదహరించారు. కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ పోలీసులు అహర్నిషలు శ్రమించి ఎంతోమంది అజ్ఞాత తీవ్రవాదులను జనజీవన స్రవంతిలోకి తీసుకవచ్చారని, నేడు వారందరూ సమాజంలో గౌరవప్రదంగా కొనసాగుతున్నారని, ఈ కీర్తి పోలీసులకు మాత్రమే దక్కుతుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలాలు, యువతకు కెరీర్ గైడెన్స్ అందించడంకోసం ప్రేరణ లాంటి కార్యక్రమాల నిర్వాహణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపును తీసుకరావడంతోపాటు యువతను సన్మార్గంలో పయనింపజేయడం, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం సమాజాభివృద్దిపట్ల పోలీసులకు ఉన్న భాద్యతను తెలియజేస్తున్నదని పేర్కొన్నారు.
పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పోలీస్ శాఖ సాంకేతికంగా ఊహించని రీతిలో అభివృద్ధి చెందిదని, ఫలితంగా పలు నేరాలు త్వరితగతిన ఛేదించబడటమే కాకుండా, నేరాల నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమవంతు సహకారం అందిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
*సమర్థవంతమైన సేవలకు ప్రశంసాపత్రాలు
కమిషనరేట్ పోలీస్ శాఖలో సమర్ధవంతమైన సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది 250 మందికి ప్రశంసాపత్రాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా ఛైర్మెన్ జీవి రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మెన్ రాజు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణణ్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పా, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), యం భీంరావ్ (సిఏఆర్), ట్రైనీ ఐపిఎస్ అధికారి. మహేష్ బాబాసాహెబ్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, టి కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, విజయసారధి. సత్యనారాయణ, విజయ్ కుమార్, కాశయ్య, గంగాధర్, సిప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, కరీంనగర్ డెయిరీ చైర్మెన్ చల్మెడ రాజేశ్వరరావులతోపాటు పోలీసు, వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, మినిస్టీరియల్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సురక్ష దినోత్సవం ప్రదర్శనకు విశేష స్పందన
రాష్ట్ర అవతరణ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులు, ఆ విభాగాల పనితీరును తెలియజేస్తూ. కరీంనగర్లో నిర్వహించిన భారీ వాహనాల ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ ర్యాలీని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణణ్, పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ప్రదర్శన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ – కమాన్ చౌరస్తా – ఇందిరాచౌక్, ఐబి చౌరస్తా కోర్టు చౌరస్తా – మంచిర్యాల చౌరస్తా – గాంధీరోడ్ – రాజీవ్ చౌక్ -తెలంగాణ అమరవీరుల స్థూపం మీదుగా తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంది.
70కి పైగా వాహనాల శ్రేణితో ఈ భారీ ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో భాగంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు, అధికారులకు చెందిన వాహనాలు ఉన్నాయి. సౌండ్ సిస్టం తో కూడిన వాహనం, వజ్ర, ట్రాఫిక్ బుల్లెట్ మోటార్ సైకిళ్ళు, కమెండోలు, టాస్క్ ఫోర్స్, రోబో విభాగం, డాగ్ స్క్వాడ్ లేక్ పోలీస్, సివిల్, సిటి ఆర్ముడ్ రిజర్వ్ విభాగాలు, షీటీం, బ్లూకోల్ట్స్, పెట్రోకార్, కళాబృందం, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, క్లూస్ టీం,, పోలీస్ బ్యాండ్, అగ్నిమాపకశాఖ విభాగంతోపాటు కమీషనరేట్ లోని పోలీసు అధికారుల వాహనాలతో ఈ ప్రదర్శన కొనసాగింది.
స్కేటింగ్ తో చిన్నారుల స్వాగతం
ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ వాహనాల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోలీసులకు జాతీయజెండా చేతబూని స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ఇందిరాచౌక్ వద్ద స్వాగతం పలికారు. ఈ స్వాగతం పక్రియ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీసులకు స్వాగతం పలికిన చిన్నారులను మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణణ్, పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడులు అభినందించారు.
బాంబులు నిర్వీర్యం, అగ్నిప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో సేవలపై ప్రదర్శన
ఈ ప్రదర్శనలో భాగంగా ఇందిరాచౌక్ వద్ద అమర్చబడిన బాంబులను గుర్తించడం, ఎక్కువ ప్రాణనష్టం, ఆస్థినష్టం జరుగకుండా వాటిని నిర్వీర్యం చేసే విధానాన్ని బాంబ్ డిస్పోజబుల్ స్వాడ్, డాగ్ స్క్వాడ్ లు ప్రదర్శించాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో మంటలను ఆర్పేందుకు తీసుకునే చర్యలపై అగ్నిమాపకశాఖ అధికారులు సిబ్బంది ప్రదర్శన ఆకట్టుకుంది. బాంబులను గుర్తించడం, నిర్వీర్యం చేయడం, అగ్నిప్రమాదాలు సంభవించిన సందర్భంలో చేసే సహాయక చర్యలపై ప్రదర్శనలిచ్చిన పోలీస్ శాఖలోని డాగ్ స్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్వ్కాడ్, అగ్నిమాపక సిబ్బందిని మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్షణ్, పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడులు అభినందించారు.