Ind vs Ban : ఢాకా వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ బంగ్లాదేశ్‌తో జరిగే మూడో వన్డేతో పాటు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
రోహిత్ స్థానంలో భారత-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత-ఎ జట్టు కూడా బంగ్లా పర్యటనలోనే ఉంది. భారత ఎ, బంగ్లాదేశ్ ఎ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఈశ్వరన్ వరుసగా రెండు సెంచరీలు చేశాడు. తొలి టెస్టులో 141 పరుగులు, రెండో టెస్టులో 157 పరుగులతో రాణించాడు.
తాను ఆడుతున్న రెండో టెస్టు ముగిసిన అనంతరం అభిమన్యు ఈశ్వరన్ చట్రోగ్రామ్‌లో భారత జట్టుతో కలవనున్నాడు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ టెస్ట్ సిరీస్ నాటికి రోహిత్ కోలుకోకపోతే అతడి స్థానంలో ఈశ్వరన్‌ను జట్టులోకి రానున్నట్లు వెల్లడించాడు. ఇక గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం అయిన మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదా ముఖేష్ కుమార్‌లలో ఒకరికి చోటు దక్కనట్లు చెప్పాడు. మోకాలి గాయం తరువాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని జడేజా టెస్టుల్లో ఆడుతుండడంతో అతడి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాల్సి ఉంది.
ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు ఈశ్వరన్ దేశవాలి క్రికెట్‌లో బెంగాల్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 177 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5419 పరుగులు చేశాడు. 17 సెంచరీలు, 23 అర్థశకాలు చేశాడు. ఓ ద్విశతకం కూడా అతడికి ఖాతాలో ఉంది.