Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: అరుదైన నవల ‘అల్పజీవి’

Sahithi Vanam: అరుదైన నవల ‘అల్పజీవి’

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినా ఎమర్జెన్సీకి, తనను అరెస్టు చేసినందుకు నిరసనగా ఈయన ఆ అవార్డును తిరస్కరించారు కూడా

సాహితీ చరిత్రలో శాశ్వతంగా, చిరస్మరణీయంగా నిలిచిపోయే నవలల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి) రాసిన ‘అల్పజీవి’ ఒకటి. సాధారణంగా బాగా గుర్తుండిపోయే నవలలు ఏ సాహితీ చరిత్రలోనైనా చాలా తక్కువగానే ఉంటాయి. అల్పజీవి నవల అటువంటి నవలల్లో ఒకటి. ఇదొక అద్భుతమైన సామాజిక స్పృహతో, చైతన్య స్రవంతితో రాసిన నవల. ఏవిధంగా చూసినా తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న నవల. ఒక కొత్త ప్రయోగం. 1922లో ఉత్తరాంధ్రలో పుట్టి, 1993లో పరమపదించిన రావి శాస్త్రి తన న్యాయవాద వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తూనే సాహితీ కృషీవలుడుగా కూడా ప్రసిద్ధి చెందారు.ఆయన అనేక నవలలు రాయడంతో పాటు, అరవై కథలు కూడా రాశారు. ఉత్తరాంధ్రకు చెందినవారు కావడం వల్ల ఆయన తన రచనల్లో ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మాండలికాలను, అక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను జొప్పించారు. ఆ ప్రాంతానికే చెందిన గురజాడ అప్పారావుకు దీటుగా ఆయన సంస్కరణాభిలాషతో సాహితీరంగానికి సేవ చేశారు.
ఒక రచయితగా ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజల వేషభాషలను, కట్టుబాట్లను బాగా దగ్గరుండి గమనించారు. ఇక్కడి మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని, అందులోని లోటుపాట్లను నిశితంగా పరిశీలించి తనరచనలను తీర్చిదిద్దుకున్నారు. ఆయన రాసిన మొట్టమొదటి నవల ‘అల్పజీవి’లో ఇవన్నీ కళ్లకు కడతాయి. పైగా అక్కడి మాండలీకాలలోనే అక్కడివారి జీవన శైలిని కళ్లకు కట్టడం మనసుకు హత్తుకుపోతుంది. ఆయన రచనా శైలి ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జేమ్‌ జాయ్స్‌ రచనా విధానాన్ని మరిపిస్తుంది. ఆయన లాగే రావి శాస్త్రి కూడా స్థానికతకు, స్థానిక పరిభాషకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇంతకూ ఆయన ఈ స్థానికతతో రాసిన అల్పజీవి నవల విక్రయాలలో రికార్డులు సృష్టించింది. విక్రయాల కంటే పఠనంలో మరింతగా ప్రజల దగ్గరకు వెళ్లింది. అల్పజీవిలో కనిపించినంత చైతన్య స్రవంతి బహుశా మరే నవలలోనూ కనిపించదని చెప్పవచ్చు. ఒక సాధారణ వ్యక్తి ఈ జిల్లాల్లో బతకడానికి జరిపే పోరాటాన్ని ఆయన ఇందులో ఇతివృత్తంగా చేసుకున్నారు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాధారణ ప్రజల జీవన స్థితిగతులను ఇంత గొప్పగా చిత్రించినవారు మరొకరు ఉండకపోవచ్చు. చాలాకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి స్వాతంత్య్ర సమరంలో కూడా పాల్గొన్న రావి శాస్త్రి ఆ తర్వాత మార్కిస్టు పార్టీ వల్ల ప్రభావితులయ్యారు.
అల్పజీవి తర్వాత ఆయన మరికొన్ని నవలలు కూడా రాశారు. ఇందులో రెండు అసంపూర్ణ నవలలు కూడా ఉన్నాయి. వీటిపేర్లు ‘రాజు మహిషి’, ‘రత్తాలు – రాంబాబు’. ఇక న్యాయవాద వృత్తి పూర్తి కావస్తున్న సమయంలో ఆయన ‘ఇల్లు’ పేరుతో మరొక నవల కూడా రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్పజీవి మాత్రం మరొక ఎత్తు. ఈ నవలలన్నీ ఉత్తరాంధ్రజిల్లాలకు చెందిన దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారి జీవన విధానానికి సంబంధించినవే. ఈ తరగతులను పట్టిపీడిస్తున్న కుల, సామాజిక జాడ్యాలను ఆయన తనదైన శైలిలో కడిగి పారేయడం అప్పట్లో చర్చనీయాంశం కూడా అయింది. ఇక 1961లో అప్పటి సారా చట్టాన్ని ఆధారం చేసుకుని ఆయన రాసిన ‘ఆరు సారా కథలు’ ఒక పక్క హాస్యాన్ని పండిస్తూనే యథార్థ జీవన చిత్రాన్ని కూడా కళ్ల ముందుంచుతుంది.ఈ చట్టాన్ని జనం ఎంతగా దుర్వినియోగం చేసిందీ ఈ కథల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ కథలన్నీ సాహితీ అభిమానులకు, కథా రచయితలకు, కథాభిమానులకు బాగా గుర్తుండిపోతాయి. ఆ తర్వాత వచ్చిన రచయితలకు ఇవి ఇతివృత్తాలను సరఫరా చేశాయని కూడా చెప్పవచ్చు.
ఇక 1955లో ఆయన ప్రచురించిన కథాసాగరం, ఆ తర్వాత తీసుకు వచ్చిన రాచకొండ కథలు, కలకంఠి, రుక్కులు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, బంగారం వంటి నవలలు కూడా ఆసాంతం చదివిస్తాయి. ఆయన ఎంత సామాజిక స్పృహ ఉన్న రచయితో, ఎంత సంస్కరణాభిలాషో గుర్తుండి పోయేలా చేస్తాయి. ఆయన నవలలు, కథలతో సరిపెట్టుకోలేదు. మూడు నాటికలు కూడా రాశారు. అవి మూఢ నమ్మకాలను, చాదస్తాలను, వ్యర్థ ఆచార, సంప్రదాయాలను నిశితంగా ఎండగడతాయి. నిజం, తిరస్కృతి, విషాదం అనే ఈ మూడు నాటికలు అప్పట్లోప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో నిజం, విషాదంనాటికల్లో ఆయన స్వయంగానటించడంకూడా జరిగింది. ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించబోయింది కానీ, ఆయన ఆ బిరుదును తిరస్కరించడం జరిగింది. అంతేకాదు, 1960లో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. అయితే, ఎమర్జెన్సీకి, తనను అరెస్టు చేసినందుకు నిరసనగా ఆయన ఆ అవార్డును కూడా తిరస్కరించడం జరిగింది. ఆయన సాహిత్యం, ముఖ్యంగా ఆయన రాసిన నవల అల్పజీవి అజరామరం అని చెప్పవచ్చు.
జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News