నీటిని ఇలా తాగితే డీహైడ్రేషన్ బారిన పడరు…
వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల తీవ్రతతో తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం బాగా ఉంది. డీహైడ్రేషన్ వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే ముఖ్యంగా వేసవిలో నీరు బాగా తాగుతుండాలి. అయితే నీటిని ఎలా తాగుతున్నారన్నది కూడా చాలా ముఖ్యమైన విషయమంటున్నారు ఆరోగ్యనిపుణులు.
శరీరానికి తగినంత నీరు తాగడం అంటే ఎక్కువ నీరు తాగడమే అనుకుంటే పొరబడ్డారన్న మాటే. అలా కానే కాదు. మీరు తాగిన నీరును శరీరం ఎంతమేర గ్రహిస్తుందన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది నీటిని బాగా తాగుతారు. అయితే తాగిన కొంతసేపటికి మూత్రం అవసరం ఫీలవుతుంటారు. దీనివల్ల శరీరానికి నీరు కావలసినంత మేర అందుతోందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ నీరు తాగినా కూడా డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. వేడిగాలులు, ఒత్తిడి, జబ్బులు, రకరకాల కారణాల వల్ల శరీరం నుంచి చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ పోతుంటాయి. దీంతో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత తలెత్తుతుంది.ఇలాంటి సమయంలో శరీరంలో ఎలక్ట్రోలైట్లు కోల్పోకుండా వాటి సమతుల్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మంచినీటిలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. అయితే నీటిని ఫిల్టర్ చేసి తాగడం వల్ల ఆ ఖనిజాలన్నీ లోపిస్తున్నాయి. దీంతో ప్లెయిన్ వాటర్ తాగడం వల్ల యూరిన్ అవసరం తరచూ అనిపిస్తుంది. దీంతో కావలసినంత నీటిని శరీరం పొందలేదు. ఈ డీహైడ్రేషన్ వల్ల శరీరానికి అవసరమయ్యే క్లోరైడ్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ ను కోల్పోతాము. ఈ లోపాన్ని వెంటనే పూడ్చాలి. ఎందుకంటే శరీరంలోని కణాలు పనిచేయాలంటే ఈ ఎలక్ట్రోలైట్లు అత్యావశ్యకాలు. అంతేకాదు కండరాలు, నరాలు సరిగా పనిచేయాలంటే ఈ ఎలక్ట్రోలైట్లు శరీరంలో సరైన పాళ్లల్లో ఉండాలి. అందుకే నీటిలోని మినరల్స్ ను శరీరం సరిగా గ్రహించాలంటే నీటితో పాటు కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే మంచిదంటున్నారు పోషకాహారనిపుణులు. ఇలా చేస్తే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో లోపించిన ఎలక్ట్రోలైట్ల నష్టం పూరింపబడుతుందని చెప్తున్నారు.
నీటిలో పింక్ సాల్ట్ లేదా సీసాల్ట్ కలపాలి. సముద్రపు ఉప్పులో కావలసినంత ఐరన్, క్లోరిన్, సోడియంలు ఉంటాయి. అందుకే నీటిని తాగేటప్పుడు అందులో చిటికెడు పింక్ సాల్ట్ కలుపుకుని తాగితే మంచిది. చాలామంది వేసవిలో నిమ్మ నీళ్లు తాగమని చెప్తుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. నిమ్మలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. అందుకే తాగే నీళ్లల్లో అరచెక్క నిమ్మరసం పిండుకుని తాగితే ఒంటికి చాలా మంచిది. అల్లం కలిపిన నీళ్లను తాగితే కూడా శరీరానికి కావలసింత హైడ్రేషన్ అందుతుంది. అంతేకాదు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలక్ట్రొలైట్లు తగిన పాళ్లల్లో శరీరానికి అందుతాయంటున్నారు పోషకాహార నిపుణులు.
ముఖ్యంగా వేసవిలో పుచ్చపండు శరీరానికి చేసే మేలు ఎంతో. ఇందులో నీరు బాగా ఉంటుంది. మంచినీటిలో కొన్ని పుచ్చకాయ ముక్కలు వేసుకుని తాగితే శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు బాగా అందుతాయి. సో…మీరు కూడా నీరు తాగే విషయంలో పోషకాహారనిపుణులను సంప్రదించి సరైన పద్ధతిలో నీటిని తాగండి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండండి…