Sunday, September 22, 2024
HomeతెలంగాణNizamabad: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేలా సర్కారు ఆకర్షిస్తోంది

Nizamabad: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేలా సర్కారు ఆకర్షిస్తోంది

పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూలంగా ఉండేలా టీఎస్-ఐపాస్ చట్టం తీసుకువచ్చి ఔత్సాహికులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు

పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా కేసిఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో, ఐ.టీ సెక్టార్లో సాధించిన అద్వితీయ పురోగతి గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతుల మంజూరు తదితర అంశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విశదపర్చారు.

- Advertisement -

ప్రభుత్వ సరళీకృత విధానాలకు ఆకర్షితులై ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న వైనాన్ని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల గురించి ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఐ.టీ శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రశంసించిన తీరు గురించి వీడియో ప్రదర్శనల ద్వారా మంత్రి వేముల వివరించారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్, తైవాన్ కు చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్ కాన్ సి.ఈ.ఓ, boasch కంపెనీ నిర్వాహకులు దత్తాద్రి, కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ తదితరులు చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్యలతో కూడిన వీడియోలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు, మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ఆవిష్కరింపజేశాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పవర్ హాలిడే లతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని సమైక్య పాలన నాటి దైన్య స్థితిని మంత్రి వేముల గుర్తు చేశారు.


స్వరాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూలంగా ఉండేలా టీఎస్-ఐపాస్ చట్టం తీసుకువచ్చి ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట గడువులోపు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. నిర్ణీత గడువు లోపు అనుమతులు మంజూరు చేయని అధికారులకు అపరాధ రుసుము విధిస్తూ, నిబంధనలకు లోబడి ఉన్న దరఖాస్తులకు సకాలంలో అనుమతులు వచ్చేలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రోడ్లు, రవాణా వసతిని మెరుగుపరుస్తూ, నీటి సౌకర్యం, 24 గంటల నాణ్యమైన విద్యుత్, శాంతి భద్రతలు నెలకొని ఉండేలా పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందన్నారు. ఫలితంగా తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో 20 వేల కంపెనీలు నెలకొల్పాయని వివరించారు. తద్వారా 24 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయని అన్నారు.


కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి వెంటదివెంట అనుమతులు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. జిల్లా స్థాయి కమిటీ ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమావేశమై ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు అందిస్తుందని తెలిపారు. టీఎస్-ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ. 800 కోట్ల పైచిలుకు పెట్టుబడితో 745 యూనిట్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వివరించారు. తద్వారా 12854 మందికి ఉపాధి లభించిందన్నారు. టీ.ఐడియా పథకం కింద 310 మంది దరఖాస్తుదారులకు రూ. 22 . 03 కోట్ల రాయితీ మంజూరు చేశామన్నారు. టీ-ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు రూ. 108 . 89 కోట్ల రాయితీని అందించామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను సన్మానించారు. విశేషంగా సేవలందిస్తున్న మీ-సేవా నిర్వాహకులకు ప్రశాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ మారే గంగారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమ్మయ్య, వివిధ శాఖల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News