Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 25 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయదుందబి మోగించారు. గురువారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. పలు సార్లు బీజేపీ, పలు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో నిలిచారు. మధ్యాహ్నం వరకు ఇరు పార్టీల మధ్య విజయం దోబూచులాడింది.
సాయంత్రం వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలకుగాను 35 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికార పగ్గాలు చేపట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిచండంతో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే, 1985 నుంచి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా రెండోసారి అధికారం చేపట్టలేదు. ఒకదఫా బీజేపీ అధికారంలో ఉంటే మరో దఫా కాంగ్రెస్ అధికారంలో ఉంటూ వస్తున్నాయి. ఇదే ఆనవాయితీ ప్రస్తుతంకూడా కొనసాగింది. గతంలో బీజేపీ అధికారంలో ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది.
గుజరాత్‌లో ఘోర ఓటమితో ఢీలాపడ్డ కాంగ్రెస్ శ్రేణులకు హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు కొంత ఊరటనిచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ నిర్ణయాత్మక విజయం కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం వెనుక మీ కృషి, అంకితభావం నిజంగా ఉన్నాయి అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. నేను మీకు మళ్లీ హామీ ఇస్తున్నాను, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నెరవేరుస్తాను” అని రాహుల్ గాంధీ తెలిపారు.