Gujarat Election: గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడు, ఏ పార్టీ సాధించలేని విధంగా తాజా పలితాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 156 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్ చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి స్థాయిలో ఏ పార్టీకి ఇన్ని స్థానాలను ప్రజలు కట్టబెట్టలేదు. అయితే, ఆప్ తొలిసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కేవలం ఐదు స్థానాల్లో ఆ పార్టీ అబ్యర్థులు విజయం సాధించారు. అయితే, బీజేపీకి ఇంతటి మెజార్టీ రావడంలో ఆప్ కీలక భూమిక పోషించిందనే చెప్పవచ్చు.
గుజరాత్‌లో ఆప్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఓట్లనే చీల్చారు. దీంతో కాంగ్రెస్ మెజార్టీ తగ్గడంతో పాటు, అత్యధిక స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీపై ఓటమి కావాల్సి వచ్చింది. అధికారం దక్కించుకొనే స్థాయిలో కాకపోయిన, దాదాపు 20 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా ఆప్ కారణమైందన్న వాదన వినిపిస్తుంది. దీంతో బీజేపీ ఊహించని స్థాయిలో అసెంబ్లీ స్థానాల్లో పాగావేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో మాధవ్‌సింగ్ సోలంకి నాయకత్వంలో కాంగ్రెస్ 149 స్థానాలు సాధించి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా 130 సీట్ల మార్కును దాటలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 156 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.
భారీ మెజార్టీతో ఏడవ సారి గుజరాత్‌లో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. దీంతో రెండవసారి సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఈనెల 12న ముహూర్తం ఫిక్స్ చేశారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీనగర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు హాజరుకాబోతున్నారని తెలిపారు.