Mainpuri Lok Sabha bypolls: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట కోసం జరిగిన ప్రతిష్టాత్మక పోరులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. అక్టోబరులో అఖిలేష్ తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. డింపుల్ యాదవ్ 2,80,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
విజయం అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తన తండ్రి రాజకీయాలను ఓటర్లు ఆమోదించారు. మెయిన్‌పురిలో ఆయన చేసిన అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్తాం అన్నారు. యూపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసింది. కానీ మెయిన్‌పురి ప్రజలు తన తండ్రి ఆశయాలను కొనసాగించే అవకాశాన్ని మాకు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మెయిన్‌పురి ప్రజలు ఇప్పుడిచ్చిన తీర్పు 2024 ఎన్నికలకు సందేశం అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మామ శివపాల్ యాదవ్ తమతో పాటు నిలబడినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అఖిలేష్ యాదవ్ అన్నారు. తన మామ పార్టీని ఎస్పీలో విలీనం చేయడంతో ఇకనుంచి బీజేపీపై పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు.
2019 లోక్‌సభ ఎన్నిల్లో ములాయం సింగ్ యాదవ్ బీఎస్పీ పొత్తుతో 94వేల ఓట్ మెజార్టీతో విజయం సాధించారు. అంతకు ముందు ఐదుసార్లు ఈ సీటును గెలుచుకున్నారు. తాజాగా అదే స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.