Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 68 అసెంబ్లీ స్థానాలకుగాను, కాంగ్రెస్ పార్టీ 40 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లు గెలుపొందగా, ఇతరులు మరో మూడు సీట్లు గెలిచారు, దీని ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం.
అయితే, బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ద్వారా తమ పార్టీ అభ్యర్థుల్ని ఎక్కడ లాక్కుంటుందేమోనని కాంగ్రెస్ కలవరపడుతోంది. అందుకే కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ చేజారకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ రిసార్ట్ రాజకీయం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేల్ని సురక్షిత ప్రదేశానికి తరలించాలనుకుంటోంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోని ఒక రహస్య ప్రదేశంలోని రిసార్ట్‌కు తరలించాలనుకుంటోంది. అక్కడ వారికి సీఎం అశోక్ గెహ్లాట్ పూర్తి భద్రత కల్పించనున్నారు. మరోవైపు తాజా ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైంది. కనీస స్థాయి సీట్లు కూడా సాధించకుండా స్వల్ప సంఖ్యలో మాత్రమే సీట్లు సాధించింది.