The Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగి తేలుతున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’కి హిమాచల్ ప్రదేశ్ షాక్ ఇచ్చింది. అక్కడ 67 స్థానాల్లో పోటీ చేసిన ‘ఆప్’కు ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అక్కడ రాష్ట్రం మొత్తం కలిపి ఆ పార్టీకి 1.10 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కొన్ని నియోజకవర్గాల్లో అయితే, నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా నోటాకు పోలైన ఓట్లు 0.60 శాతం. ‘ఆప్’కు మొత్తంగా చూస్తే ఇంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం అతి స్వల్ప ఓట్లు పోలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ మూడో స్థానంలో నిలిచి, భవిష్యత్ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంది. కానీ, తాజా ఫలితాలతో ఆప్ ఆశలు గల్లంతయ్యాయి. ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత బీజేపీకి మద్దతు పలికారు. అయితే, హిమాచల్ ఓటర్లు ‘ఆప్’ను పట్టించుకోకపోవడానికి కారణం ఉంది.
పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కొద్దిరోజులు ప్రచారం సాగించినప్పటికీ తర్వాత గుజరాత్‌పై దృష్టి సారించింది. కీలక నేతలెవరూ ఈ పార్టీలో చేరలేదు. పార్టీని నడిపించే మాస్ లీడర్ ఎవరూ లేకపోవడం కూడా లోటుగా ఉంది. అయితే, ఎన్నికల్లో ఆప్.. ప్రజలకు అనేక హామీలిచ్చింది. ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు, మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు, ఉద్యోగాలు వంటి హామీలు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఓటమి అనంతరం హిమాచల్ ప్రదేశ్ ఆప్ అధ్యక్షుడు మాట్లాడారు. తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ఇవి తమ మొదటి ఎన్నికలు మాత్రమే అని, చివరి ఎన్నికలు కావని వ్యాఖ్యానించారు.