Central Govt Jobs: కేంద్ర సర్వీసుల్లో వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాల గురించి కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో ప్రకటన చేసింది. ఆగష్టు 2022 నాటికి కేంద్ర సర్వీసులు అన్నీ కలిపి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్ల శాఖ తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో బుధవారం ఈ విషయం వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 9,79,327 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏ పోస్టులు 23,584కాగా, గ్రూప్ బి పోస్టులు 1,18,807 ఉన్నాయి. గ్రూప్ సి పోస్టుల్లో 8,36,936 ఖాళీలున్నాయి. రైల్వే శాఖలో 293,943 ఖాళీలు, రక్షణ శాఖలో 264,704 ఖాళీలు, హోం శాఖలో 143,536 ఖాళీలున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన 4,035,203 ఉద్యోగాలు కాకుండా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. తాజా ఖాళీల్లో అతి తక్కువ ఉద్యోగాలున్నది ఉపరాష్ట్రపతి కార్యాలయంలో. అక్కడ 64 ఉద్యోగాలకుగాను, 8 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
తర్వాత వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగంలో 13 ఖాళీలే ఉండగా, పబ్లిక్ అసెస్ మేనేజ్‌మెంట్‌లో 14 ఖాళీలున్నాయి. కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేలో 2.9 లక్షల ఖాళీలుండగా, ప్రస్తుతం 12.2 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రధాని కార్యాలయంలో 129 ఖాళీలున్నాయి. రాష్ట్రపతి కార్యాలయంలో 91 ఖాళీలున్నాయి. ఇక ఎప్పటికప్పుడు నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత అక్టోబర్‌లో 75,000, నవంబర్‌లో 71,000 ఉద్యోగాల్ని భర్తీ చేశారు.