Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Manipur violence: పరిష్కారం దిశగా సరైన అడుగులు

Manipur violence: పరిష్కారం దిశగా సరైన అడుగులు

అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరించారా అన్న కోణంపై కూడా ఈ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది

మణిపూర్‌లో జాతిపరమైన హింసా విధ్వంసకాండలపై దర్యాప్తు జరపడానికిఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించడం ఏవిధంగా చూసినా సరైన నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ హింసా విధ్వంసకాండల వల్ల వంద మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 35 వేల మంది నిర్వాశితులయ్యారని అంచనా. ఈ ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండ ప్రజ్వరిల్లడానికి, విస్తరించడానికి దారి తీసిన కారణాలపైన ఈ దర్యాప్తు జరుగుతుంది. అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరించారా అన్న కోణంపై కూడా ఈ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు వల్ల ఇక్కడి వివిధ జాతుల మధ్య వివాదాలు సమసిపోయే అవకాశం లేదు కానీ, హింసాకాండకు సంబంధించిన నిజానిజాలు వెలుగు చూసే అవకాశం మాత్రం ఉంది. వెనుక చోదక శక్తులు ఏవీ లేనిదే సాధారణంగా ఈ స్థాయిలో హింసాకాండ చోటు చేసుకోవడం జరగదు.పోలీస్‌ స్టేషన్ల మీద దాడిచేసి మారణాయుధాలను దౌర్జన్యంగా తీసుకుపోయి, ఒక వర్గం మీద మరొక వర్గం యథేచ్ఛగా ఉపయోగించుకున్నదంటే తప్పకుండా వీటి వెనుక ఎవరో ఉండే ఉంటారు.
బాధ్యతాయుతమైన పాలకులు ఈ హింసాకాండ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, వారికి శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించినప్పుడే ప్రజల్లో ఆ పాలకుల పట్ల నమ్మకం పెరుగుతుంది. హింసా విధ్వంసకాండలు చోటు చేసుకున్న ప్రాంతాలలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా పర్యటించి, ఇరువర్గాలతో మాట్లాడిన తర్వాత దాదాపు 28 శాతం ఆయుధాలను తిరిగి పోలీస్‌ స్టేషన్లకు అప్పగించడం జరిగింది. ఇంత తక్కువ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేయడాన్ని బట్టి, ఇక్కడ పోటా పోటీగా ఆందోళనలు చేస్తున్న మైతీలు, కుకీల మధ్య అపనమ్మకం ఇంకా కొనసాగుతోందని భావించాల్సి ఉంటుంది. అంతేకాక, ఈ రెండు వర్గాల మధ్య వారధిగా పనిచేసి, శాశ్వత శాంతి సామరస్యాలను నెలకొల్పడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందినదనడానికి కూడా ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. ఇంఫాల్‌ లోయకు, కుకీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు భద్రత కల్పించడానికి, పునరావాసాలు కల్పించడానికి భద్రతా దళాలు అహర్నిశలూ చేస్తున్న కృషి ఏమాత్రం సరిపోవడం లేదు.
పాలక పక్షంలో ఉన్న మైతీ, కుకీ జాతులకు చెందిన శాసనసభ్యులు నడుంబిగించి,మధ్యవర్తులుగా వ్యవహరించిరాజీ కుదర్చడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. వాస్తవానికి ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదర్చడం అంత సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిపితే కానీ ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. మైతీలకు షెడ్యూల్డ్‌ తెగల స్థాయిని కల్పించడంలో న్యాయం లేదని కుకీలలో, నాగాలలో కూడా, అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది, పాలనలో కూడా భాగస్వాములుగా ఉన్న కుకీలు మైతీల డిమాండును అడ్డుకోవడం నైతిక ధర్మం కాదని మైతీలు భావిస్తున్నారు. ఇంఫాల్‌ లోయలో అన్ని జాతుల వారికీ ఉన్నట్టు పర్వత ప్రాంతాలలో పొలాలు, స్థలాలు కొనుక్కోవడానికి తమకు హక్కు లేదని కుకీలు వాదించడం అర్థరహితంగా ఉందని కూడా మైతీలు చెబుతున్నారు. పర్వత ప్రాంతాలలో భూముల కొనుగోలుకు మొదటి నుంచీ హక్కు దారులు తామేనని కుకీలు పేర్కొంటూ ఇతర జాతివారిని ఆ ప్రాంతాలలో అడుగుపెట్టనివ్వడం లేదు. పాలకులు కూడా ఈ విషయంలో సామరస్య వాతావరణాన్ని సృష్టించలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి జాతుల వారు ఈ సంకుచిత భావాల నుంచి బయటపడి, ఈ జటిల సమస్యకు రాజ్యాంగపరమైన పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ముందుగా హింసాకాండను అణచివేయాల్సి ఉంది. నిరాశ్రయులను వారి వారి ప్రాంతాలకు పంపాల్సి ఉంది. వారి జీవితాలకు భద్రత కల్పించాల్సి ఉంది. హింసాకాండను ప్రేరేపిస్తున్నవారిని గుర్తించి, వారిని ఈ ఆందోళనకారుల నుంచి దూరం చేసి, చట్టపరంగా వారిని శిక్షించాల్సి ఉంది. ఆ తర్వాతే సమస్యా పరిష్కారానికి ప్రయత్నించడం మంచిది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించి, తమ దర్యాప్తును ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News