Saturday, November 23, 2024
Homeఫీచర్స్Lady Singham: సైనీ..లేడీ సింగం, సూపర్ కాప్

Lady Singham: సైనీ..లేడీ సింగం, సూపర్ కాప్

భార్య సైనీ ఎక్కడ ఉందో తెలియక భర్త ఫోను చేస్తే ‘టివిలో కనిపిస్తాను. చూడు’ అని సైనీ సమాధానం చెప్పారట. సైనీ అన్నఈ మాటలు ఆమెకు పనిపట్ల ఉన్న నిబద్ధతను చాటుతుంది

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మంజిల్ సైనీ. లక్నో సూపర్ కాప్. ఎన్నో హైప్రొఫైల్ కేసులను ఛేదించిన ఐపిఎస్ అధికారిణి. డాక్టర్ అమిత్ కుమార్ ప్రధాన సూత్రధారిగా నడిచిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ కేసును ఛేధించిన తర్వాత సైనీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగాయి. ఈ లేడీ సింగమ్ గురించి కొన్ని విశేషాలు..
భారత పోలీసు సర్వీసు 2005 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారిణి సైనీ. సమర్ధవంతమైన, ఎంతో ధైర్యవంతురాలైన పోలీసు అధికారిణిగా మాత్రమే కాదు మరోవిధంగా కూడా సైనీ ప్రఖ్యాతిపొందారు. లక్నో తొలి మహిళా సీనియర్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సైనీ రికార్డు స్రుష్టించారు. లక్నోకు సీనియర్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీసుగా పోస్టింగ్ అవడానికి ముందు సమాజ్ వాద్ పార్టీ సుప్రిమో అయిన ములాయ్ సింగ్ యాదవ్ సొంత ఊరైన ఎతావాలో ఆమె విధులు నిర్వహించారు. 2016లో రాజేష్ పాండే స్థానంలో లక్నోకు కొత్త సీనియర్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సైనీ పదవీ బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ముజాఫర్ నగర్ లోని బదాయున్ లో, ఆ తర్వాత మధురలో విధులు నిర్వహించారు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణురాలైన సమయంలో సైనీ గర్భవతి. దేశంలోనే తొలి వివాహిత ఐపిఎస్ మహిళా అధికారిణిగా కూడా సైనీ రికార్డు స్రుష్టించారు.

- Advertisement -

2021లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జి)లో డిఐజిగా కూడా ఆమె వ్యవహరించారు. చదువులో సైనీ ఎప్పుడూ ముందుండేవారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫన్ కళాశాలలో ఫిజిక్స్ చదివారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేటప్పుడు బంగారు పతకాన్ని సాధించారు. చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అంతేకాదు మూడేళ్ల పాటు ఒక ప్రైవేటు ఫోరమ్ లో కూడా సైనీ పనిచేశారు. అప్పుడే సైనీ చూపు యుపిఎస్ సి మీద పడి ఆ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2005లో యుపిఎస్ సి పరీక్ష రాసిన సైనీ తొలి ప్రయత్నంలోనే ఐపిఎస్ కు ఎంపికయ్యారు. కాలేజీలో చదివేటప్పుడు సైనీ జస్పాల్ దేహాల్ ని ప్రేమించారు. 2000లో అతన్నే సైనీ పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.


పోలీసు అధికారిణిగా సైనీ పలు హైప్రొఫైల్ కేసులను ఛేదించి సూపర్ కాప్ అని పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ అమిత్ కుమార్ సూత్రధారిగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను ఛేదించిన తర్వాత సైనీ పేరు రాష్ట్ర ప్రజల్లో, పోలీసు వర్గాల్లో బాగా మారుమోగింది. 2008లో మొరాదాబాద్ ఎస్ పిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తన కిడ్నీ దొంగిలించబడిందని ఒక కార్మికుడు సైనీకి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా కొన్ని వారాల పాటు సైనీ నాయకత్వంలోని బ్రుందం తీవ్రంగా క్రుషిచేసి దీనికి మూలమైన పెద్ద అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను బట్టబయలు చేసింది. అలా సైనీ విధి నిర్వహణలో బెస్ట్ కాప్ గా పేరు
సంపాదించుకోవడమే కాదు అందరిచేతా సూపర్ కాప్ అనిపించుకున్నారు. ఏతావాకు ఎస్ ఎస్ పిగా ఉన్నప్పుడు సమాజ్ వాదీ పార్టీ జండాలను ఆ పార్టీ కార్యకర్తలు తమ వాహనాలపై అనధికారికంగా వాడారు. దీనికి వ్యతిరేకంగా వారిపై కేసులను నమోదుచేయడానికి సైతం సైనీ వెనకాడలేదు.

అలాగే ఎతావాలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సందర్భంలో పదిమంది పోలీసు కానిస్టేబుల్స్ పోలీసు వ్యాన్ లో నిద్రించడం సైనీ గమనించారు. వీరిందరికీ సైనీ శిక్ష విధించారు. అందులో భాగంగా ఒక ప్లేగ్రౌండ్ లోపల ఆ కానిస్టేబుల్స్ అందరి చేత జాగింగ్ చేయించారు. నిజాయితీ, క్రమశిక్షణ ఉన్న పోలీసు అధికారిణిగా సైనీకి మంచి పేరుంది. మురాదాబాద్ ఎస్ పిగా పోస్టయిన కొద్ది రోజుల్లోనే డాక్టర్ అమిత్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను సైనీ అత్యంత సాహసంగా పట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో పెద్ద సంచలనమే రేపింది. తన నిజాయితీ అయిన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని సైనీ ఎంతగానో పెంచిందంటారు పలువురు. అంతేకాదు ఎందరో యువతులు పోలీసు యూనిఫామ్ లో ఉన్న సైనీని తమ రోల్ మోడల్ గా తీలసుకోవడం మరో విశేషం. అది తనకెంతో గర్వంగా ఉంటుందని సైనీ ఎప్పుడూ అంటారు. లక్నో సిటీలో విధులు నిర్వహించిన తొలి మహిళా పోలీసు అధికారిణి సైనీ. ఆ సిటీ పోలీసు అధికారిగా నగరంలో నేరాలను అణచివేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడమే తన ప్రధాన లక్ష్యాలని సైనీ పేర్కొన్నారు. అంతేకాదు పోలీసు వ్యవస్థలోని జూనియర్ ఉద్యోగులు ప్రజల సమస్యలపై వెంటనే ప్రతిస్పందించేలా చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నది కూడా తన మరో ప్రధాన లక్ష్యమని సైనీ అన్నారు. అంతేకాదు రాష్ట్ర రాజధానిలో మహిళల భద్రత దిశగా కూడా సైనీ పలు చర్యలు చేబట్టారు.

సిటీలోని కొన్ని జోన్స్ లో విమెన్ పెట్రోలింగ్ పెంచారు. అంతేకాదు స్త్రీల రక్షణలో భాగంగా హెల్ప్ లైన్ ఏర్పాటుచేశారు. మహిళా రక్షణ పరంగా వేగంగా ప్రతిస్పందించడం, ఎఫ్ ఐ ఆర్ లను వెంటనే నమోదు చేయడం వంటి చర్యలు కూడా సైనీ చేబట్టారు. నేరాలను నియంత్రించడంలో, నేరస్థులను పట్టుకోవడంలో నూతన టెక్నాలజీని వాడడంలో సైతం సైనీ ముందున్నారు. 2008లో మురాదాబాద్ లో ఆమె ఛేదించిన కిడ్నీ రాకెట్ అంతర్జాతీయంగా శరీరభాగాల వ్యాపారంలో విస్రుత నెట్ వర్కును బట్టబయలు చేసింది. దీని ముఖ్య సూత్రధారిని పట్టుకోవడంలో సైనీ సాహసాలే చేశారు. ఈ రాకెట్ లో పలువురు వైద్యులతో పాటు ఎన్నో పెద్ద తలకాయలు ఉండడాన్ని సైతం ఆమె ధైర్యంగా బయటపెట్టారు. ఈ రాకెట్ ను బయటపెట్టే పనిలో తలమునకలై ఉన్న సమయంలో కుటుంబాన్ని సైతం ఆమె మర్చిపోయారు. భార్య సైనీ ఎక్కడ ఉందో తెలియక భర్త ఫోను చేస్తే ‘టివిలో కనిపిస్తాను. చూడు’ అని సైనీ సమాధానం చెప్పారట. సైనీ అన్నఈ మాటలు ఆమెకు పనిపట్ల ఉన్న నిబద్ధతను చాటుతుంది.

రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడులను కూడా తరచూ ఎదుర్కొంటుంటానని సైని చెప్పుకొచ్చారు. తన నిజాయితీని, నైతిక విలువలతో కూడిన వైఖరిని మెచ్చుకున్న రాజకీయనాయకులు కూడా లేకపోలేదంటారు ఆమె. అయితే కేసుల విషయంలో తొణకని తన కఠిన వైఖరే మీడియా నుంచి, న్యావవ్యవస్థ నుంచి తనకు గట్టి మద్దతును సంపాదించిపెట్టిందని సైనీ చెప్తారు. అదే ముజాఫర్ నగర్, మధుర, అలహాబాద్ వంటి పలుచోట్ల మంచి శక్తిసామర్థ్యాలు గల అధికారిణిగా నిలబడేలా చేసిందంటారు. ఎందరో నేరస్తులకు తను తెలుసునని, తన పట్ల తీవ్ర వ్యతిరేకత సైతం వారిలో బాగా ఉందని సైనీ అంటారు. అందరి సాధారణ మహిళల్లాగే తను కూడా తన భర్త, కొడుకు, కూతురు భధ్రత, రక్షణలను బాగా కోరుకుంటానని ఆమె చెప్తారు.కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ‘పోలీసు విధుల నుంచి ఇంటికి తిరిగి రాగానే అందరి మహిళల్లాగే నేను కూడా ఒక తల్లి, ఒక కోడలు, ఒక భార్యను’ అని సైనీ అంటారు. పోలీసు ఉద్యోగం అంటే ఇరవైనాలుగు గంటలూ బిజీగా ఉండే పని. అయినా కూడా కుటుంబం, ప్రొఫెషన్ విధులను సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటూ ముందుకుసాగాలని సైనీ అంటారు.


‘కుటుంబంతో నేను ఎంత నాణ్యమైన సమయం గడిపాననే దానికి అధిక ప్రాధాన్యం ఇస్తాన’ని సైనీ ఎప్పుడూ అంటారు. సైనీ భర్తది వ్యాపార కుటుంబం. సైనీ మంచి అథెలెట్ కూడా.‘ మా పుట్టింటి వారంతా యూనిఫామ్ ఉద్యోగాలు చేసిన వారే. అందుకే పోలీసింగ్ అనేది మా రక్తంలోనే ఉంది. నేను ఈ రోజు ఇలా విజయవంతంగా నిలుచున్నానంటే ఆ క్రెడిట్ మొదట మా నాన్నగారికే చెందుతుంది. మా నాన్న బాగా చదువుకోమని నాకు ఎప్పుడూ చెపుతుండేవారు. అలాగే నా భర్త నాకు అందిస్తున్న అండదండలు కూడా ఈ రోజు నేను ఇలా సక్సెస్ ఫుల్ పోలీసు అధికారిణిగా నిలబడగలగడానికి మరో ప్రధాన కారణం ’ అని సైనీ చెప్పారు. మొదట్లో సైనీ తల్లిదండ్రులు కూడా పోలీసు ఉద్యోగం ఒత్తిడిని ఆమె ఎంతవరకూ తట్టుకోగలదో అని సందేహించారట. ‘పోలీసు ఉద్యోగం పట్ల నాకు ఉన్న నిబద్ధత, ఉత్సాహం చూసిన తర్వాత వాళ్లు నా వెన్నుదన్నుగా నిలబడ్డారు’ అని తన తల్లిదండ్రుల గురించి సైనీ పంచుకున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే చూడడానికి చిన్న అమ్మాయిగా కనిపేంచే సైనీలో బయటకు కనిపించని కఠినమైన ‘కాప్’ దాగున్నారని చాలామందికి తెలియదు. ఈ మాటలు స్వయంగా సైనీనే పలుమార్లు అన్నారు. విధి నిర్వహణలో, వ్యక్తిగత జీవితంలో పెనుసవాళ్లుగా తను ఫీలయిన విషయాలు ఏమిటని అడిగితే ‘డ్యూటీ చేసేటప్పుడు శాంతిభధ్రతల సమస్యను పరిష్కరించడం, విచారణలను ఎదుర్కోవడం పెనుసవాలుగా భావిస్తా. వ్యక్తిగత జీవితంలో పిల్లల ఎమోషనల్ అవసరాలు తీర్చే విషయంలో వ్రుత్తిపరమైన సమయాభావం వల్ల తరచూ ఒత్తిడికి లోనవుతుంట’ అని సైనీ జవాబిచ్చారు.

మంజిల్ సైనీ 1975, సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో పుట్టింది.

2005 ఐపిఎస్ బ్యాచులోని ఎనిమిది మంది మహిళా ఐపిఎస్ లలో బిడ్డ ఉన్న ఏకైక మహిళ సైనీ.
 2013లో ఉత్తరప్రదేశ్ ముజాఫర్ బాద్ లో మతకల్లోలాలు తలెత్తినపుడు సమర్థవంతంగా విధులను నిర్వహించి సూపర్ కాప్ గా సైనీ నిలిచారు. ఈ దాడులకు కారణమైన వారిపై సైనీ విజయవంతంగా ఉక్కుపాదం మోపగా హఠాత్తుగా ఆమెను అక్కడ నుంచి బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News