Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Basanti Devi: కోశీ నదిని కాపాడిన బసంతీ దేవి

Basanti Devi: కోశీ నదిని కాపాడిన బసంతీ దేవి

Basanti Devi: పర్యావరణాన్ని, మహిళలను విడదీసి చూడలేము. ఆ కోవలోకే వస్తారు ఉత్తరాఖండ్ కు చెందిన బసంతీ దేవి. కోశీ నదిని పునరుద్ధరించేందుకు తన గ్రామంతో పాటు పలు గ్రామాల మహిళలతో కలిసి ఆమె పెద్ద ఉద్యమానికే పూనుకుంది.

- Advertisement -

ఆమె గురించి…
బసంతి దేవి గురించి బాగా తెలిసిన వారు ఆమెను, ప్రకృతిని విడదీసి చూడలేమంటారు. ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్హ్ ఆమె ఊరు. ఆమెతో పాటు ఆ గ్రామస్థులందరికీ కోశీ నదే జీవనాధారం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఫ్రతి పనికి వారికి ఆ నది నీరే ఆధారం. బసంతి బాల్య వితంతువు. నాల్గవ తరగతి చదువుతున్నప్పుడే ఇంట్లోవాళ్లు ఆమెకు పెళ్ళి చేశారు. బసంతికి 12 ఏళ్లు ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. పెళ్ళయిన రెండేళ్లకే భర్తను పోగొట్టుకున్న బసంతిని ఉత్తరాఖండ్ లోని కాసానిలో ఉన్న లక్ష్మీ ఆశ్రమానికి పంపేశారు. బాల్యం నుంచీ బసంతికి చదువంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ ఆశ్రమంలో ఉంటూనే పాఠశాల విద్య పూర్తిచేశారు. 2003లో వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్త ఆమెలో ఆందోళన నింపింది. అడవులను నరికివేయడం వల్ల, అడవులు అగ్నికి ఆహుతి అవడం వల్ల కోశీనది ఉనికే ప్రమాదంలో పడిందన్నది ఆ వార్త సారాంశం. అప్పుడే ఆ నదిని కాపాడాలని, అక్కడి పచ్చటి అడవులను పరిరక్షించాలని బసంతి నిర్ణయించుకున్నారు. అందుకోసం దగ్గరలోని పలు గ్రామాలలోని మహిళలను కలిసి వారికి సమస్యను వివరించి అందుకోసం సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వారితో పంచుకోవడం ప్రారంభించారు. అలా ఈ లక్ష్య సాధనకై చుట్టుపట్ల గ్రామాలలోని మహిళలను ఎంతో కష్టపడి కూడగట్టారు. దాదాపు 200 గ్రామలకు చెందిన మహిళలు 20 సంవత్సరాల పాటు అక్కడి అడవులను, కోశి నదిని కాపాడడానికి రంగంలో దిగి పోరాటం కొనసాగించారు. అంతేకాదు ఆ ప్రాంతంలో పలు చెట్లు నాటారు. అక్కడి ప్రతి గ్రామంలోని మహిళలు గ్రూపులుగా ఏర్పడి పోరాడారు. ఆ ప్రాంత అడవులను విజయవంతంగా పునరుద్ధరించారు. ‘సేవ్ కోశి మూవ్మెంట్’ పేరుతో దీర్ఘకాలం ఉద్యమం కొనసాగించారు. బసంతి నాయకత్వంలో నేటికి కూడా వాళ్ల ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వీరి శ్రమ ఫలిచింది. కోశీ ప్రాంతంలోని బీడు ప్రాంతాలు పచ్చదనంతో కళకళ లాడడం ప్రారంభించాయి. ఎండిపోయిన ఎన్నో నీటి ఊటలు తిరిగి నీటితో గల గల పారుతున్నాయి. సోమేశ్వర్ ప్రజలు అక్కడి భూముల్లో విత్తనాలు చల్లి ధాన్యం పండిస్తున్నారు. బసంతి దేవి 50 గ్రామాల్లో మహిళా సంఘటనలను ఏర్పాటుచేశారు. సోమేశ్వర్ లోని కాసాని నుంచి కోట్లీ దాకా పలు గ్రామాల్లోని మహిళలను కూడగట్టి ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నారు.

పలు సామాజిక కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొనేలా చైతన్యపరిచారు. అక్కడ అడవులను, చెట్లను, కోశి నదిని, చిన్న చిన్న నీటి ఊటలను కాపాడేందుకు కాలినడకన ఎన్నో గ్రామాల్లో బసంతి దేవి ప్రయాణించారు. ఎందరో గ్రామీణ మహిళలను ఏకతాటిపై నడిపించి కోశీ ఉద్యమంలో పాల్గొనేలా చైతన్య పరిచారు. గ్రామాల్లోని మహిళలను సాధికారులుగా నిలబెట్టారు. సారాకు బానిసలు కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలలో మద్యం తెచ్చే చేటుపై అవగాహన పెంచి విజయం సాధించారు.
ఇరవై ఏళ్లపాటు చేసిన అకుంఠిత శ్రమ, దీక్షల వల్లే బసంతీ దేవి తన ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగారు. ఆమె, అక్కడి వివిధ గ్రామాల ప్రజలు చేసిన ఉధ్యమ ఫలితంగా ఒకప్పుడు వేసవిలో ఏండిపోతుండే కోశి నది, ఇతర ఊటలు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ నిండు జలాలతో ఏరులై పారుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంత అడవుల్లో ఎన్నో వైవిధ్యమైన వుక్ష సంపద కనిపిస్తుంది.

ఇదంతా బసంతి, ఆమె మహిళా బ్రుందాలు చేసిన విశేష కృషి వల్లే సాధ్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. నేడు కోశీ నదీ ప్రాంతం అంతా మిగులు జలాలతో కళ కళ లాడుతోందంటే కూడా బసంతి దేవి, పలు గ్రామాల మహిళల క్రెడిట్ అనే చెప్పాలి. మహిళా సంఘాలతో పాటు పాఠశాలల్లో కూడా బసంతి తన సేవలను అందించారు. డెహ్రాడూన్ లోని పాఠశాలల్లో కొంతకాలం పనిచేశారు. కొండలు, పర్వతాలంటే బసంతికి ఎంతో ఇష్టం. అందుకే 2002లో కాసాని వచ్చి అక్కడ జల్, జమీన్, జంగల్ సాధనే లక్ష్యంగా గ్రామీణ మహిళలను కూడదీసి పర్యావరణ ఉద్యమానికి నడుంకట్టారు. తాముండే ప్రాంతంలో అడవులను నరకడం, అడవులు అగ్నికి ఆహుతి అవడం ఇవన్నీ ఆమెలో ఆందోళన పెంచాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పదేళ్లల్లో కోశి నది కనిపించకుండా పోతుందని బసంతికి అర్థమైంది. అదే ఆమెను కోశీ పరిరక్షణ ఉద్యమానికి పూనుకునేట్టు చేసింది. గ్రామీణ మహిళలను ఈ ఉద్యమంలో కూడగట్టడానికి బసంతి తొలి రోజుల్లో ఎంతో కష్టపడ్డారు. గ్రామ ప్రజలు చెట్లు నరుకుతున్న ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి చెట్లు నరకడం వల్ల భవిష్యత్తులో తలెత్తే పర్యావరణ ఉపద్రవాలను వివరించేవారు. వార్తా పత్రికల్లో వచ్చిన పలు వ్యాసాలను చదివి వారికి వివరించి చెప్పేవారు. కోశీ నది చుట్టుపట్ల గ్రామాల్లో ఒకసారి కరువు తలెత్తి నీటి కోసం ఘర్షణలు చెలరేగాయి. అప్పుడు కోశీ నది ఎండిపోతే ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి అని ప్రశ్నించి ప్రజలలో నీరు, అడవులు, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు. వారిని చైతన్య పరచడానికి తనకు దొరికిన ఏ అవకాశాన్ని బసంతి వదులుకోలేదు. అడవులకు, నీటికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వారికి అర్థం అయ్యేలా వారిని బసంతి ఎడ్యుకేట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి గ్రామీణ ప్రజలు అడవుల్లో చెట్లను నరకడం ఆపేశారు. అడవుల్లో అగ్గి రాచుకోకుండా క్రుషి చేశారు.

అడవులను పరిరక్షించడం ప్రారంభించారు. జల్, జమీన్, జంగల్ సంరక్షణ వల్ల అక్కడి ఎకోసిస్టమ్ సురక్షితంగా నిలవడం మొదలైంది. 2003లో అల్మోరాలో ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గడం గమనించిందో అదే ఆమె ఉద్యమానికి నాంది అయింది. 168 కిలోమీటర్ల పొడవైన కోశి నది పరిరక్షణ, అడవుల సంరక్షణ బసంతి బేహాన్ నిత్య చింతన అయింది. ‘జీవ నది అయిన, ఎందరో ప్రాణాలు నిలిపే, పర్యావరణాన్ని కాపాడే కోశీ నది ఎండిపోవడమన్న భావననే నేను భరించలేకపోయా. అందుకే ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాను’ అంటారామె. పర్యావరణ పరిరక్షణకు బసంతి చేసిన విశేష సేవలకు గాను 2016లో నారీ శక్తి పురస్కారం లభించింది. 2022 లో పద్మశ్రీ అవార్డును కూడా బసంతి అందుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వయసులోనూ తన లక్ష్య సాధనలో వెనుదిరగకుండా ముందుకు అడుగులు వేస్తూ ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News