Saturday, November 23, 2024
HomeతెలంగాణThalasani: బోనాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాం

Thalasani: బోనాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాం

గోల్కొండ బోనాల ఉత్సవాలకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం గోల్కొండ కోట వద్ద ఈ నెల 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్కొండ బోనాల ఉత్సవాలకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తారని చెప్పారు. బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాదిమంది భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.10 లక్షలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్ల కోసం సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్ల విడుదల చేసిందని చెప్పారు. బస్తీలలోని దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు. బోనాల ఉత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా నియంత్రించేందుకు పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు, జనరేటర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను జరిపేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవసరమైన పోలీసు సిబ్బందిని వివిధ జిల్లాల నుండి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా తాత్కాలికంగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు నామమాత్రంగా నిధులు కేటాయించే వారని, అరకొర ఏర్పాట్లు చేసేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్డివొ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ లు స్వామి, నజీర్, ఫహీమోద్దీన్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ ఈఓ శ్రీనివాస్ రాజు, పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రకాంత్, గోల్కొండ కోట ఇంచార్జి నవీన్, డిసి శ్రీనివాస్, వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కిరణ్ కర్రె ప్రభాకర్, ఆసీఫ్ నగర్ ఏసీపీ శివ మారుతి, ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, గోషా మహల్ ఏసీపీ కోటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ రవీంద్ర మోహన్, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, వాటర్ వర్క్స్ డీజీఎమ్ ఖాజా, ట్రాన్స్ కో ఎస్ఇ బ్రహ్మం, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News